Telugu Global
Telangana

ఈడీ వెతికినా దొరకలేదు.. అగ్ని ప్రమాదంతో బయటపడిన 'క్యూ-నెట్' ఆఫీస్!

క్యూ-నెట్ సంస్థపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్‌తో పాటు ఇతర కేసులు నమోదు చేసింది.

ఈడీ వెతికినా దొరకలేదు.. అగ్ని ప్రమాదంతో బయటపడిన క్యూ-నెట్ ఆఫీస్!
X

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు యువతీ, యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై మహాంకాళి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ ఘోర అగ్నిప్రమాదం వల్ల క్యూ-నెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కార్యాలయం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు యువతులు ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ కార్యాలయానికి చెందిన వారే అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

కాగా, క్యూ-నెట్ సంస్థపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్‌తో పాటు ఇతర కేసులు నమోదు చేసింది. గతంలో దేశంలోని పలు నగరాల్లో క్యూ-నెట్ కార్యాలయాలపై దాడులు కూడా చేసింది. కానీ, సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ-నెట్ బ్రాంచ్‌ వివరాలు తెలియక పోవడంతో ఈడీ వదిలేసింది. నగరంలోనే ఇతర ప్రాంతాల్లో ఉన్న బ్రాంచీలపై దాడులు చేసింది. తాజాగా అగ్నిప్రమాదం కారణంగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని బీ-బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 510, 511లో క్యూనెట్ కార్యాలయాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు ఈ క్యూ-నెట్ సంస్థలోనే పని చేస్తున్నారని.. వారు డిపాజిట్లు కూడా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో క్లూస్ టీమ్ అనేక ఆధారాలను సేకరించింది. క్యూ-నెట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కెడియా ఇన్ఫోటెక్‌లో ముందుగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత మంటలు వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్‌లోకి చేరాయని.. దీంతో భారీగా కార్బన్ మోనాక్సైడ్ వెలువడినట్లు క్లూస్ టీమ్ చెబుతోంది. ఎదురుగా ఉన్న క్యూ-నెట్ ఆఫీసులోకి ఈ కార్బన్ మోనాక్సైడ్ భారీగా వెళ్లడంతో అక్కడే తలుపులు వేసుకున్న వారు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అసోసియేషన్, కెడియా ఇన్ఫోటెక్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేశారు.

ఇప్పటికే క్యూ-నెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌కు చెందిన శివ, విజయలను పోలీసులు ప్రశ్నించారు. అలాగే ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ వందలాది కస్టమర్ల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్లుగా తీసుకున్నట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. జనవరిలో ఈడీ ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఈ సంస్థపై దాడులు చేసింది. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ క్యూ-నెట్‌కు మాస్టర్ ఫ్రాంచైజీగా ఉన్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. జనవరిలోనే ఈ సంస్థకు చెందిన 36 అకౌంట్లతో పాటు రూ.90కోట్లను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత క్యూ-నెట్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే, తాజాగా అగ్ని ప్రమాదం కారణంగా ఈ సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నట్లు తేలడం అధికారులను ఆశ్చర్యపరిచింది. అయితే మృతి చెందిన వాళ్లు కూడా క్యూ-నెట్ బాధితులే అని వారికి సంస్థతో లోతైన సంబంధాలు ఉండవని అధికారులు అంటున్నారు.

First Published:  18 March 2023 5:40 AM GMT
Next Story