Telugu Global
Telangana

టీఆరెస్ లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్

బీజేపీకి రాజీనామా చేసిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు టీఆరెస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో వారిద్దరూ గులాబీ కండువా కప్పుకున్నారు.

టీఆరెస్ లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
X

బీజేపీకి షాక్ ఇస్తూ సీనియర్ రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్ కుమార్ లు కేటీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరారు.

హైదరాబాద్ శివార్లలోని మన్నే గూడలో బీఎంఆర్ శారదా ఫంక్షన్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు టీఆరెస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్వామిగౌడ్, శ్రావణ్ కుమార్ లు తిరిగి స్వంత గూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్దికి ఉద్యమాకారులంతా ఏకం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ జీ వోలనంతా ఏకం చేసి వీరోచిత పోరాటం చేసిన స్వామి గౌడన్నకు స్వాగతం పలుకుతున్నాను అని కేటీఆర్ అన్నారు.

''ప్రతిభావంతుడు, మంచి స్నేహితుడు డాక్టర్ దాసోజు శ్రావణ్ కు కూడా స్వాగతం పలికుతున్నాను మేము ఇంత కాలం వేరు వేరు పార్టీలో ఉన్నప్పటికీ మేము ఎప్పుడు కలిసినా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం'' అని అన్నారు కేటీఆర్.

విభజన హామీలు అమలు కావడానికి జాతీయ పార్టీ, అందులోనూ అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఉపయోగముంటుందని నమ్మకంతో బీజేపీలో చేరానని, అయితే ఆ పార్టీ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ ఉంటే భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు స్వామి గౌడ్. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టి దేశ‌వ్యాప్త రాజకీయాలకోసం ముందుకు కదులుతూ ఉంటే తాను కూడా మళ్ళీ వెనక్కి రావాలనుకున్నానని, కేసీఆర్ తో మాట్లాడితే ఆనందంగా ఒప్పుకున్నారని స్వామి గౌడ్ అన్నారు.

నన్ను సమాజానికి దగ్గర చేసిన, నాకు ఒక గుర్తింపు ఇచ్చిన టీఆరెస్ నుండి ఆవేశంతో, అనాలోచితంగా బైటికి వెళ్ళాను అని శ్రావణ్ కుమార్ అన్నారు. మళ్ళీ నన్ను వెనక్కి రమ్మని కేసీఆర్, కేటీఆర్ లు అడిగినప్పుడు వెనకా ముందూ ఆలోచించకుండా స్వంత ఇంటికి వచ్చేశానని, నవభారత నిర్మాణం కోసం నేను కూడా కాలు కలిపి పని చేయడం కోసం భారత రాష్ట్ర సమితిలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నాను అని శ్రావణ్ పేర్కొన్నారు.

బీజేపీలో ప్రత్యామ్నాయ రాజకీయాలుంటాయని నమ్మకంతో వెళ్ళాను. కానీ అక్కడ క్షుద్ర రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, పెట్టుబడిదారీ రాజకీయాలు తప్ప మరేమీ లేవని అర్దం చేసుకొని ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. నా చివరి శ్వాస వరకు టీఆరెస్ తో ఉంటానని శ్రావణ్ కుమార్ అన్నారు.

First Published:  21 Oct 2022 11:50 AM GMT
Next Story