Telugu Global
Telangana

ఆరుగురి స‌జీవ‌ద‌హ‌నం.. అనుమానాలెన్నెన్నో..

సింగ‌రేణి ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండేళ్ల ముందు అన్‌ఫిట్‌గా ధ్రువీక‌ర‌ణ పొందితే వార‌సుల‌కు ఉద్యోగం వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కుమారుడికి ఉద్యోగం కోసం స‌హ‌క‌రించాల‌ని భార్య, కుమారులు కొంత‌కాలంగా అత‌నిపై ఒత్తిడి చేస్తున్నారు.

ఆరుగురి స‌జీవ‌ద‌హ‌నం.. అనుమానాలెన్నెన్నో..
X

మంచిర్యాల జిల్లాలో అమానుష ఘ‌ట‌న జ‌రిగింది. ఒకే ఇంట్లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఆరుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మంద‌మ‌ర్రి మండ‌లం గుడిపెల్లి(వెంక‌టాపూర్‌) గ్రామంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం క‌లిగించింది. ఏసీపీ ప్ర‌మోద్ మ‌హాజ‌న్ తెలిపిన వివ‌రాలు, స్థానికులు వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం.. గుడిపెల్లి గ్రామంలో మ‌సా ప‌ద్మ (45), శివ‌య్య (50) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వారికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. ఒక కుమార్తె నాలుగు నెల‌ల క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. రెండో కుమార్తె హైద‌రాబాద్‌లో, కుమారుడు న‌స్పూర్‌లో నివాస‌ముంటున్నారు.

సింగ‌రేణిలో మ‌జ్దూర్‌గా ప‌నిచేస్తున్న శ‌నిగార‌పు శాంత‌య్య అలియాస్ స‌త్త‌య్య (57) మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండ‌లం ఉట్కూర్‌. అత‌నికి భార్య సృజ‌న‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులిద్ద‌రూ నిరుద్యోగులు. వీరంతా గోదావ‌రిఖ‌నిలో నివాసం ఉంటున్నారు. ప‌దేళ్ల క్రితం శాంత‌య్య‌కు సింగ‌రేణి అధికారుల గృహాల్లో ప‌నిచేసే ప‌ద్మ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. కొంత‌కాలంగా అత‌ను ప‌ద్మ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విష‌య‌మై అత‌నికి భార్య‌తో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో సృజ‌న కొంత‌కాలంగా మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఉద్యోగం, ఆస్తుల విష‌యంలో గొడ‌వ‌లు...

సింగ‌రేణి ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండేళ్ల ముందు అన్‌ఫిట్‌గా ధ్రువీక‌ర‌ణ పొందితే వార‌సుల‌కు ఉద్యోగం వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కుమారుడికి ఉద్యోగం కోసం స‌హ‌క‌రించాల‌ని భార్య, కుమారులు కొంత‌కాలంగా అత‌నిపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విష‌యంలోనూ వారి మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. మ‌రోప‌క్క శాంత‌య్య అత‌ని జీత‌భ‌త్యాల సొమ్మంతా స‌హ‌జీవ‌నం చేస్తున్న ప‌ద్మ‌కే కేటాయిస్తున్నాడు. అలాగే ఉట్కూర్‌లో స్థ‌లాన్ని విక్ర‌యించగా వ‌చ్చిన రూ.25 ల‌క్ష‌లు న‌గ‌దు సైతం ప‌ద్మ‌కే ఇచ్చిన‌ట్టు కుటుంబ స‌భ్యుల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారంతా శాంత‌య్య‌పై క‌క్ష పెంచుకుని ఉన్నారు. ఈ నేప‌థ్యంలో శాంత‌య్య‌పై గ‌త ఆరు నెల‌ల కాలంలో రెండు సార్లు హ‌త్యాయ‌త్నం, ఒక‌సారి కిడ్నాప్ య‌త్నం జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే భ‌ర్త స‌హా ప‌ద్మ కుటుంబం మొత్తాన్ని అంత‌మొందించాల‌ని సృజ‌న సూచించిన మేర‌కు ఆమె ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఘ‌ట‌న జ‌రిగిందిలా..

అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల స‌మ‌యంలో ప‌ద్మ ఇంట్లో మంట‌లు చెల‌రేగుతున్న విష‌యం గుర్తించిన స్థానికులు మంట‌ల‌ను అదుపు చేసేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు. అయినా మంట‌లు అదుపులోకి రాలేదు. దీంతో వారు పోలీసుల‌కు, అగ్నిమాప‌క శాఖ కార్యాల‌యానికి స‌మాచారం అందించారు. వారు వ‌చ్చేస‌రికే ఇంట్లో ఉన్న ఆరుగురూ స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు న‌లుగురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్న‌ట్టు తెలిసింది.

పెద్ద‌మ్మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చి...

ప‌ద్మ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డింది. దీంతో కొండంపేట‌కు చెందిన ఆమె చెల్లెలి కుమార్తె మౌనిక ఆమెను ప‌రామ‌ర్శించేందుకు త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఐదు రోజుల క్రితం గుడిపెల్లికి వ‌చ్చింది. ఇంత‌లోనే ఈ ఘోరం జ‌ర‌గ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

అనుమానాలెన్నో...

- అర్ధ‌రాత్రి జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌పై ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగి ఉంటే.. ఇంట్లోని వారు బ‌య‌టికి రావ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. కానీ ఆరుగురూ ఇంట్లోనే మృతిచెందారు.

- ఇంత ప్ర‌మాదం జ‌రిగినా చుట్టుప‌క్క‌ల వారికి ఇంట్లోని వారి అరుపులు, ఆర్త‌నాదాలు వినిపించ‌లేదు. మంట‌ల వ‌ల్ల వ‌చ్చిన శ‌బ్దాలు, చ‌ప్పుళ్లు విని మాత్ర‌మే తాము ప్ర‌మాదాన్ని గుర్తించామ‌ని స్థానికులు చెబుతున్నారు.

- ఘ‌ట‌న స‌మ‌యంలో ఇంట్లోని వారు కేక‌లు పెట్ట‌లేదంటే.. వారిని ముందే చంపి ఆ త‌ర్వాత మంట‌లు అంటించారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

- ఇంటికి స‌మీపంలో ఉన్న ఒక ఆటో ముందు సీటు (డ్రైవ‌ర్ సీటు)లో కారం పొడి ఉంది.

- ఇంటికి స‌మీపంలో రెండు ప్లాస్టిక్ క్యాన్లు అనుమానాస్ప‌ద స్థితిలో ఉన్నాయి. వాటిలో పెట్రోల్ తెచ్చి ఈ నిందితులు ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

- ఇంత ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టికీ ఇంట్లోని గ్యాస్ సిలిండ‌ర్ పేల‌లేదు. కానీ ఇంట్లోని ఆరుగురూ స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. వారి మృత‌దేహాలు గుర్తుప‌ట్ట‌లేని స్థాయిలో కాలిపోయాయి.

- లేదంటే మ‌త్తు మందు ఇచ్చిన అనంత‌రం ఇంటికి నిప్పంటించి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

- పోలీసుల ద‌ర్యాప్తులోనే ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానాలు వెలుగు చూసే అవ‌కాశ‌ముంది.

First Published:  18 Dec 2022 5:52 AM GMT
Next Story