Telugu Global
Telangana

ఉమ్మ‌డి నల్లగొండ జిల్లాలో ఆ మూడు సీట్లపై ఉత్కంఠ

ప్రధానంగా సూర్యాపేటలో బీఆర్ఎస్ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ ఎవరిని బరిలో నిలుపుతుందనేది ఆసక్తిగా మారింది.

ఉమ్మ‌డి నల్లగొండ జిల్లాలో ఆ మూడు సీట్లపై ఉత్కంఠ
X

కాంగ్రెస్‌ రెండు విడతల్లో వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనుంది. అయితే ఉమ్మ‌డి నల్లగొండ జిల్లాలోని మూడు స్థానాలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రధానంగా సూర్యాపేటలో బీఆర్ఎస్ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ ఎవరిని బరిలో నిలుపుతుందనేది ఆసక్తిగా మారింది. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్‌ కోసం సీనియర్ లీడర్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఇప్పటికే నాలుగు సార్లు, ఓసారి ఇండిపెండెంట్‌గా పోటీచేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. సూర్యాపేట నుంచి ఓ సారి విజయం సాధించారు. అయితే ఈ సారి పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి మధ్య టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ఇక ఉమ్మ‌డి నల్లగొండ జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న మరో స్థానం తుంగతుర్తి. ఈ టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున ఆశావహులున్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో నిలిచిన అద్దంకి దయాకర్‌.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరోసారి టికెట్ అందుకుని తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు సైతం తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మందుల సామేల్, నగరిగారి ప్రీతం, పిడమర్తి రవి టికెట్ రేసులో ఉన్నారు.

ఇక మిర్యాలగూడ స్థానం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ తరఫున నల్లమోతు భాస్కరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానం కూడా కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టింది. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ కోసం బత్తుల లక్ష్మారెడ్డితో పాటు జానారెడ్డి మరో కుమారుడు రఘువీర్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని లెఫ్ట్ పార్టీలకు కేటాయిస్తారని తెలుస్తోంది. కానీ, ఈ నిర్ణయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు కేటాయిస్తే మిర్యాలగూడను బీఆర్ఎస్‌కు బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First Published:  28 Oct 2023 4:01 AM GMT
Next Story