Telugu Global
Telangana

సీఎం రేవంత్ రెడ్డి జాబ్ ఆఫర్ తిరస్కరించిన నళిని..

ఇన్నాళ్ల తర్వాత తనకు ఉద్యోగమివ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు నళిని కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి జాబ్ ఆఫర్ తిరస్కరించిన నళిని..
X

తెలంగాణ ఉద్యమ సమయంలో సస్పెన్షన్ కు గురైన డీఎస్పీ నళిని.. మరోసారి టాక్ ఆఫ్ తెలంగాణగా మారారు. అప్పట్లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు నళిని. తెలంగాణ ఏర్పాటయ్యాక మాత్రం ఆమె తెరమరుగయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆమెను గుర్తు పెట్టుకుని మరీ.. ఆమెకు ఉద్యోగం ఇచ్చే విషయంలో ఉదారంగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని, పోలీస్ డిపార్ట్ మెంట్ లో కాకపోయినా, ఇతర విభాగంలో అయినా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో నళిని నేరుగా తెరపైకి వచ్చారు. సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు నళిని.

"ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా ' సోషల్ స్టిగ్మా'ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూడేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణమొక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు, 2009 డిసెంబర్ 9 న నా రాజీనామా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. ఆ తర్వాత నాటి సీఎం రోశయ్య.. మహిళా దినోత్సవం రోజున నా ఉద్యోగాన్ని తిరిగిచ్చారు. రాజీనామా విత్ డ్రా చేసుకొని డిపార్ట్ మెంట్ లో చేరడం నేను చేసిన పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది. ఏడాదిన్నరపాటు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఒత్తిడి, అవమానాలు ఎదుర్కొన్నాను. నా ప్రమోషన్ ఆపేశారు, నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఆ తర్వాతి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నా పరిస్థితి తెలియజేయాలనుకున్నా కుదర్లేదు. తదనంతర పరిస్థితుల కారణంగా మళ్లీ ఉద్యమంలోకి రావాల్సి వచ్చింది. ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనడంతో ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు నాపై మోపారు. నాలోని డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారు." అంటూ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు నళిని.

ఉద్యోగం వద్దు.. కానీ,,!

ఇన్నాళ్ల తర్వాత తనకు ఉద్యోగమివ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు నళిని కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తానిప్పుడు మహర్షి దయానంద సరస్వతి సేవలో ఉన్నానని, వేదమాత, యజ్ఞ దేవతలు తనలో తిరిగి ప్రాణం పోశారని చెప్పుకొచ్చారు. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నానన్నారు. తనను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరని, తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎప్పటికీ రావన్నారు.

తనకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానన్నారు నళిని. ప్రభుత్వం ఫండ్ ఇస్తే వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రం ఏర్పాటు చేస్తానన్నారు. ప్రస్తుతం 'వేదం యజ్ఞం' అనే పుస్తక రచనలో తాను బిజీగా ఉన్నానని, అది పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు నళిని.

First Published:  17 Dec 2023 8:05 AM GMT
Next Story