Telugu Global
Telangana

అనాథలకు శాశ్వత అండ ఉండేలా అత్యున్నత విధానం : మంత్రి కేటీఆర్

అత్యున్నతమైన ఆర్ఫన్ పాలసీని రూపొందించడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలులో సమావేశం అయ్యింది.

అనాథలకు శాశ్వత అండ ఉండేలా అత్యున్నత విధానం : మంత్రి కేటీఆర్
X

అనాథలకు శాశ్వత అండ ఉండేలా దేశంలోనే అత్యున్నత విధానాన్ని రూపొందించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అనాథలను 'చిల్డ్రన్ ఆఫ్ స్టేట్'గా గుర్తిస్తూ.. వారి పూర్తి సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించారు. అనాథల సంరక్షణ చేపట్టి.. వారిని ప్రయోజకులుగా మార్చి.. వారికి ఒక కుటుంబ ఏర్పడే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించడానికి ఒక కేబినెట్ సభ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అత్యున్నతమైన ఆర్ఫన్ పాలసీని రూపొందించడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలులో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

అనాథల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, యూనిసెఫ్ మార్గదర్శకాలను కూడా పరిశీలించి.. వాటికి అనుగుణంగా తెలంగాణ ఆర్ఫన్ పాలసీని రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్‌లోని వట్టినాగులపల్లిలోని ఎస్‌వోఎస్ అనే సంస్థ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు అక్కడ సబ్‌కమిటీ పర్యటించాలని నిర్ణయించారు.

అలాగే దేశం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు, సభ్యులు పర్యటించి సమగ్రమైన నివేదికను 10 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, వి. శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


First Published:  4 Aug 2023 1:58 AM GMT
Next Story