Telugu Global
Telangana

దర్యాప్తు సంస్థలు 'సౌత్ గ్రూప్' అనే పదం వాడటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దర్యాప్తు సంస్థలు 'సౌత్ గ్రూప్', 'సౌత్ లాబీ' అనే పదాలు ఉపయోగించి దక్షిణాదిని అవమానించారంటూ హైదరాబాద్‌కు చెందిన పటోళ్ల కార్తీక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూప్ అనే పదం వాడటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దర్యప్తు సంస్థలు 'సౌత్ గ్రూప్' అనే పదం వాడటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. అయితే సుప్రీంకోర్టులో కేసు వివరాలను సమర్పించిన పత్రాల్లో.. దక్షిణాదిని అవమానించేలా 'సౌత్ గ్రూప్' అనే పదాన్ని వినియోగించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ.. సుప్రీంకోర్టుకు ఇచ్చి చార్జీషీట్లు, ఎఫ్‌ఐఆర్‌లో 'సౌత్ గ్రూప్', 'సౌత్ లాబీ' అనే పదాలను వాడింది. ఇలా వాడటం అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలను అవమానించడమే అని, వారి మనోభావాలను గాయపరచడమే అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

దర్యాప్తు సంస్థలు 'సౌత్ గ్రూప్', 'సౌత్ లాబీ' అనే పదాలు ఉపయోగించి దక్షిణాదిని అవమానించారంటూ హైదరాబాద్‌కు చెందిన పటోళ్ల కార్తీక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిల్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసులో ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నా.. సీబీఐ ఎక్కడా 'నార్త్ గ్రూప్' అని సంబోధించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు.

దక్షిణాదికి చెందిన వారంతా నేరాలకు, కుంభకోణాలకు పాల్పడుతున్నారనే భావన కలిగించేలా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని సుప్రీంకోర్టుకు వివరించారు. కాగా, దేశంలో కేసులు దర్యాప్తు చేయాల్సిన ప్రతిష్టాత్మక సంస్థలు ఇలా ఒక ప్రాంతాన్ని ఎత్తి చూపుతూ అధికారిక పత్రాల్లో ఎలా పేర్కొంటారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి అసలు ఉపేక్షించబోమని పేర్కొంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని దర్యాప్తు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా చేయకపోతే తామే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లుగానే మేము చార్జి షీటు దాఖలు చేశామని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. కానీ దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే సౌత్ గ్రూప్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

First Published:  9 May 2023 2:12 AM GMT
Next Story