Telugu Global
Telangana

ఏపీ, తెలంగాణకు కలిపి సూపర్ పీసీసీ? కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే వ్యూహం!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. 2018లో కాస్తో కూస్తో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దీన స్థితికి దిగజారింది.

ఏపీ, తెలంగాణకు కలిపి సూపర్ పీసీసీ? కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే వ్యూహం!
X

ఉమ్మడి ఏపీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. తెలుగుదేశం పార్టీతో పోటాపోటీ రాజకీయం చేస్తూ అప్పటి కాంగ్రెస్ నాయకులు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగే లేకుండా పోయింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కారణంగా ఏపీలో పార్టీ ఇబ్బందులు పడినా.. తెలంగాణలో మాత్రం తప్పకుండా అధికారంలోకి వస్తుందని అధిష్టానం అంచనా వేసింది. కానీ అంచనాలన్నీ తలక్రిందులై.. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతోంది.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. 2018లో కాస్తో కూస్తో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దీన స్థితికి దిగజారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సీనియర్లు కలవలేకపోతున్నారు. ఇప్పటికే కీలక నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించేస్తోంది. అయినా సరే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంకా పాత కాంగ్రెస్ పోకడలతోనే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే దృష్టి పెట్టారు. ఇటీవల పలువురు తెలంగాణ నేతలు ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌తో కలిసి పార్టీని చిన్నాభిన్నం చేస్తున్నారంటూ రేవంత్‌పై గట్టిగానే ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని మార్చే ఆలోచన చేస్తోంది.

తెలంగాణలో పార్టీ ఎలాగోలా నడుస్తోంది. అదే ఏపీలో అయితే ఊసులోనే లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రజలు కాంగ్రెస్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయిందంటే ప్రజలకు పార్టీపై ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇక మిగిలిన కొద్ది మంది ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్ప దేనికీ ముందుకు రావడం లేదు. ఇటీవలే రాష్ట్ర పీసీసీకి గిడుగు రుద్రరాజును అధ్యక్షుడిగా నియమించింది. సీనియర్ నాయకులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, పద్మశ్రీ సుంకర, పి. రాకేశ్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. వీరి నియామకం వల్ల ఏపీ కాంగ్రెస్‌లో వచ్చే మార్పేమీ ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖర్గే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తున్నది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సరికొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు రాష్ట్రాల వ్యవహారాలు తెలిసిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నారు. సూపర్ పీసీసీని ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఒక బాధ్యుడిని నియమిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షులను కొనసాగిస్తూనే.. సూపర్ పీసీసీని ఏర్పాటు చేయాలనేది ఖర్గే వ్యూహంగా చెబుతున్నారు.

మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అ తర్వాత ఆరు నెలలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. అందుకే ఈ సూపర్ పీసీసీ వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు తెస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకరికే బాధ్యతలు ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంపై పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలంగానే ఉన్నదని.. ఏపీలోనే తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సీనియర్లు అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి వెళ్లిపోయిందని, కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. సూపర్ పీసీసీ ఏర్పాటు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story