Telugu Global
Telangana

సూర్యాపేట‌లో సూప‌ర్ ఫైట్

రెండు ల‌క్ష‌ల 42 వేల మంది ఓట‌ర్లున్న సూర్యాపేట‌లో బీసీ ఓట‌ర్లు 50 శాతం మంది ఉన్నారు. అయితే ప్ర‌ధాన పార్టీలేవీ బీసీల‌కు టికెట్లివ్వ‌లేదు. బీసీలు ఏ పార్టీకి ఓటేస్తే విజ‌యం అటువైపే మొగ్గుతుంది.

సూర్యాపేట‌లో సూప‌ర్ ఫైట్
X

విజ‌య‌వాడ, హైద‌రాబాద్ హైవే మీద ఉండే సూర్యాపేట అంటే రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కూ ఓ బాండింగ్‌.. అలాంటి సూర్యాపేట ఇప్పుడు సూప‌ర్ ఫైట్‌కు సిద్ధ‌మైంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నేత రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డి, బీజేపీ త‌ర‌ఫున సంకినేని వెంకటేశ్వరరావు బ‌రిలోకి దిగారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో హోరాహోరీగా పోరాడిన ఈ ముగ్గురు అభ్య‌ర్థులు మ‌రోసారి ఓట‌ర్ల‌ ముందు తీర్పు కోసం నిల‌బ‌డ్డారు.

అభివృద్ధి నినాదంతో జ‌గ‌దీష్‌రెడ్డి

సూర్యాపేట నుంచి 2014, 2018లో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి తొమ్మిదిన్నరేళ్లుగా మంత్రిగా పనిచేస్తున్నారు జగదీష్‌రెడ్డి. తాను చేసిన అభివృద్ధే త‌న‌ను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. తొమ్మిదిన్న‌రేళ్ల త‌న మంత్రి ప‌ద‌వితో నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 7వేల కోట్ల రూపాయ‌ల అభివృద్ధి చేశాన‌ని చెబుతున్నారు. త‌న ప‌నితీరు, కేసీఆర్ మీద ప్ర‌జ‌లకు ఉన్న విశ్వాసం గెలుపు బాటలు వేస్తాయ‌ని జ‌గ‌దీష్‌రెడ్డి మాట‌. సూర్యాపేట‌ను జిల్లా కేంద్రంగా చేయ‌డానికి త‌న కృషినీ వివ‌రిస్తున్నారు. అయితే బీఆర్ఎస్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని, అది ప్ర‌తికూల ప్ర‌భావం చూపే ప్ర‌మాద‌ముందని చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత క‌లిసొస్తుంద‌న్న రాంరెడ్డి

ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలే త‌న‌ను గెలపిస్తాయ‌న్న‌ది మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశ‌. గ‌త ఎన్నిక‌ల్లో 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని, గెలిపించాల‌ని ఓట‌ర్ల‌పై సెంటిమెంట్ అస్త్రం కూడా ప్ర‌యోగిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు ఆధిక్యం తెచ్చిపెట్టిన మూడు గ్రామీణ మండలాల‌పై మ‌ళ్లీ న‌మ్మ‌కం పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ త‌ర‌ఫున నామినేష‌న్ వేశారు. అయితే ఆయ‌న్ను కాంగ్రెస్ నేత‌లు అతిక‌ష్టం మీద పోటీ నుంచి త‌ప్పించ‌గ‌లిగారు. ఆయ‌న ఏ మేర‌కు దామోద‌ర్‌రెడ్డితో క‌లిసిప‌నిచేస్తాడో చూడాలి.

గుబులు రేపుతున్న సంకినేని

ఇక బీజేపీ అభ్య‌ర్థి సంకినేని వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు దీటుగా ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీ తొలి జాబితాలోనే టికెట్ ద‌క్కించుకుని, నియోజక‌వ‌ర్గంలో అమిత్‌షా స‌భ కూడా నిర్వ‌హించి దూకుడుగా ఉన్నారు. న‌ల్గొండ జిల్లాలో నామ్‌కే వాస్తేగా ఉన్న బీజేపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీప‌డి ఏకంగా 40 వేల ఓట్లు తెచ్చుకున్నారు సంకినేని. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో గ‌త ఎన్నిక‌ల్లో తెచ్చుకున్న ఓట్ల‌కు ఈసారి మోడీ మంత్ర కూడా కలిసొచ్చి గెలుస్తాన‌ని ఆయ‌న ధీమా. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు లేకపోవడం ఇక్క‌డ బీజేపీకి పెద్ద మైన‌స్‌.

బీసీల ఓట్లే కీల‌కం

రెండు ల‌క్ష‌ల 42 వేల మంది ఓట‌ర్లున్న సూర్యాపేట‌లో బీసీ ఓట‌ర్లు 50 శాతం మంది ఉన్నారు. అయితే ప్ర‌ధాన పార్టీలేవీ బీసీల‌కు టికెట్లివ్వ‌లేదు. బీసీలు ఏ పార్టీకి ఓటేస్తే విజ‌యం అటువైపే మొగ్గుతుంది. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న నల్గొండ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ జగ‌దీష్‌రెడ్డికే టికెట్ ఇవ్వ‌డంతో జాన‌య్య యాద‌వ్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీసీల ఓట్లు ఆయ‌న ఏ మేర‌కు చీలుస్తార‌నేది కీల‌కం కానుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటున్నా.. సంకినేని వెంక‌టేశ్వ‌ర‌రావు దాన్ని బ‌లంగా చీలుస్తార‌ని, కాబ‌ట్టి తామే గెలుస్తామ‌ని బీఆర్ఎస్ ధీమా ప్ర‌క‌టిస్తుంటే బీఆర్ఎస్‌కు బీసీల ఓట్లు ప‌డ‌వ‌ని, గ‌త ఎన్నిక‌ల్లోనే స్వ‌ల్ప మెజార్టీతో కారు బ‌య‌ట‌ప‌డింద‌ని, ఈసారి విజ‌యం హ‌స్తం త‌మ‌దేన‌ని కాంగ్రెస్ అంటోంది. ఈ రెండూ కాదు ఈసారి త‌మ‌దే గెలుప‌ని బీజేపీ చెబుతోంది. ఏదైనా సూర్యాపేట‌లో సూప‌ర్ ఫైట్ ఖాయ‌మే.

First Published:  16 Nov 2023 10:41 AM GMT
Next Story