Telugu Global
Telangana

హైద‌రాబాద్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి!

ఇఫ్లూలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ఆవరణలో ఓ పీజీ విద్యార్థిని వాకింగ్ చేస్తూ చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది.

హైద‌రాబాద్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి!
X

హైద‌రాబాద్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి!

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ ఇఫ్లూలో విద్యార్థినిపై లైంగిక దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తనపై ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్లు పీజీ విద్యార్థిని ఆరోపించారు. పవిత్రమైన విశ్వ విద్యాలయంలో లైంగిక దాడి చేసిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో విద్యార్థులకు రక్షణ కల్పించలేకపోయిన వీసీ సురేష్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు వీసీ మిస్సింగ్‌ అంటూ ఆయన ఫొటో ఉన్న పోస్టర్లను క్యాంప‌స్‌లో అతికించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. చివరికు విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై వర్సిటీ అధికారులు స్పందించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం అందడంతో వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్సిటీలోని ఫిర్యాదుల కమిటీ తక్షణమే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇఫ్లూలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ఆవరణలో ఓ పీజీ విద్యార్థిని వాకింగ్ చేస్తూ చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు తనను లైంగికంగా వేధించిన‌ట్లు ఆమె తన సహచరులకు తెలిపింది. వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి, అటునుంచి భరోసా కేంద్రానికి పంపించినట్టు సీఐ ఆంజ‌నేయులు చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తుండగా, ఆ ప్రాంతం చీకటిగా ఉండటంతో ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదని పేర్కొన్నారు. తాము భరోసా కౌన్సెలింగ్ సెంటర్‌లో బాధిత మహిళ స్టేట్‌మెంట్ తీసుకున్నామని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.

బాధిత విద్యార్థిని ఏం చెప్పిందంటే..

తాను రాత్రి 10 గంటల సమయంలో ప్రొఫెసర్స్ క్వార్టర్స్ దగ్గర 3వ గేటు వైపు నడిచానని.. రెండో మలుపు తీసుకొని నడుస్తుండగా ఇద్దరు తనను జుట్టు పట్టుకుని వెనక్కి లాగారని బాధిత విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఆ ఇద్దరు దుండగులు తనను పాత ఆరోగ్య కేంద్రం సమీపంలోని ప్రాంతం వైపునకు లాక్కెళ్లారని, అందులో ఒకడు పొడుగ్గా ఉన్నాడని, ఇంకొకడు మాములు ఎత్తుగా ఉన్నాడని, వారిద్దరూ ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారని తెలిపింది. వారిద్దరూ తనపై లైంగిక దాడి చేశారని వివరించింది. తాను తన స్నేహితుడికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే వారిద్దరూ తన ఫోన్‌ను దూరంగా పడేశారని తెలిపింది. ఆ తర్వాత వారిద్దరూ తనను విడిచిపెట్టి పారిపోయారని వెల్లడించింది. తాను పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయానని, తన స్నేహితుడికి మళ్లీ కాల్ చేసేందుకు ప్రయత్నించానని.. కానీ కొంత సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నానని బాధిత విద్యార్థిని తెలిపింది.

First Published:  20 Oct 2023 6:19 AM GMT
Next Story