Telugu Global
Telangana

హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం..

ఫీజు కట్టలేదనే కారణంతో టీసీ ఇవ్వకుండా ప్రిన్సిపల్‌ సుధాకర్‌ రెడ్డి వేధించాడని ఆరోపిస్తున్నారు తోటి విద్యార్థులు. ప్రిన్సిపల్‌ తీరు వల్లే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు.

హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం..
X

ఫీజు కట్టకుంటే టీసీ ఇచ్చేది లేదంటూ కాలేజీ ప్రిన్సిపల్ తెగేసి చెప్పడంతో విసిగివేసారిపోయిన ఓ స్టూడెంట్ చివరకు ప్రిన్సిపల్ రూమ్ లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో ప్రిన్సిపల్ సుధాకర్ తోపాటు, ఏవో అశోక్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. హైద‌రాబాద్‌ రామాంతపూర్ కాలనీలోని నారాయణ కాలేజీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫీజు కట్టలేదనే కారణంతో టీసీ ఇవ్వకుండా ప్రిన్సిపల్‌ సుధాకర్‌ రెడ్డి వేధించాడని ఆరోపిస్తున్నారు తోటి విద్యార్థులు. ప్రిన్సిపల్‌ తీరు వల్లే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ప్రిన్సిపల్‌ టీసీ ఇచ్చి ఉంటే ఈఘటన జరిగేది కాదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యార్థి పెట్రోల్ పోసి తగలబెట్టుకున్న ఘటనతో ప్రిన్సిపల్‌ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ దగ్గర ధర్నా చేపట్టారు. కొంతమంది కళాశాలపై దాడి చేశారు. కాలేజీ బిల్డింగ్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రెగ్యులేషన్‌ కమిటీని ఏర్పాటుచేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టారీతిగా ఫీజుల వసూలు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.

First Published:  19 Aug 2022 1:51 PM GMT
Next Story