Telugu Global
Telangana

బీజేపీలో ఆధిపత్య పోరు.. ఇతర నేతల ఎదుగుదలను అడ్డుకుంటున్న బండి సంజయ్.!

బీజేపీలో అధ్యక్షుడు బండి సంజయ్ అంతా తానై నడిపిస్తున్నారు. ఇతర నేతలను సైడ్ చేస్తూ.. తానే బీజేపీకి పెద్ద దిక్కు అనేలా ప్రచారం చేసుకుంటున్నారు.

బీజేపీలో ఆధిపత్య పోరు.. ఇతర నేతల ఎదుగుదలను అడ్డుకుంటున్న బండి సంజయ్.!
X

తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. సీనియర్ నేతలు ఇతరుల ఎదుగుదలను అడ్డుకుంటూ.. తామే పై చేయి సాధించాలనే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న హైకమాండ్.. ఆధిపత్య పోరుపై సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఒక్క నాయకుడు కూడా స్పందించలేదని.. కావాలనే ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారని బీజేపీ అగ్రనాయకత్వం మండిపడుతోంది. అందుకే మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈటల ఇంటికి వెళ్లిన సమయంలో కూడా ఆయనకు జరుగుతున్న అన్యాయంపై అమిత్ షా మాట్లాడారని.. ఈ విషయంలో బాధపడవద్దని.. భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బీజేపీలో అధ్యక్షుడు బండి సంజయ్ అంతా తానై నడిపిస్తున్నారు. ఇతర నేతలను సైడ్ చేస్తూ.. తానే బీజేపీకి పెద్ద దిక్కు అనేలా ప్రచారం చేసుకుంటున్నారు. ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఇమేజ్ పెంచుకుంటూనే.. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీపై పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బండి సంజయ్ వర్గం ఇప్పుడు యాక్టీవ్‌గా మారిపోగా.. సీనియర్ నేత, మంత్రి కిషన్ రెడ్డి వర్గం సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి సంజయ్ కంటే కిషన్ రెడ్డే పార్టీలో సీనియర్. కానీ, ఎప్పుడైతే సంజయ్‌కి పార్టీ పగ్గాలు దక్కాయో.. అప్పటి నుంచి ఆయన తన హవా కొనసాగిస్తున్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీ విజయాలు సాధిస్తోందనే ప్రచారాన్ని ఢిల్లీ వరకు చేస్తున్నారు. దీంతో ఇతర సీనియర్ నాయకుల మాటను సంజయ్ అసలు పట్టించుకోవడం లేదని.. కిషన్ రెడ్డి, ఈటల, వివేక్ వంటి సీనియర్ నేతలకు ప్రాధాన్యత దక్కుండా చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.

టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్‌లోనే కాకుండా రాష్ట్రంలో బలమైన నేత. సీఎం కేసీఆర్‌నే ఢీ కొట్టి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీల్లో మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్నారు. తన జిల్లా నుంచే మరో నేత రావడం బండి సంజయ్ ఓర్వలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర సమావేశంలో బండి సంజయ్ కొందరు సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి పరోక్షంగా ఈటలను ఉద్దేశించి చేసినవే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల.. ఇతర పార్టీ నాయకులతో టచ్‌లో ఉంటూ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడానికి కూడా ఈటల చేసిన ప్రయత్నమే కారణమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దీంతో పార్టీలో ఈటలకు మద్దతు పెరుగుతూ వస్తోంది. ఇది బండి సంజయ్ సహించలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది.

రాష్ట్ర బీజేపీలో తనను దాటి ఏ నాయకుడూ వెళ్లకుండా బండి సంజయ్ జాగ్రత్తపడుతున్నారని. రేపు తెలంగాణలో అధికారం దక్కితే సీఎం రేసులో తానే ఉండాలని సంజయ్ కోరుకుంటున్నారని.. అందుకే ఇతర నాయకులను సైడ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కొందరు సీనియర్ నేతల ఈ విషయాన్ని అమిత్ షా, జేపీ నడ్డా దృష్టికి తీసుకొని వెళ్లారు. కాంగ్రెస్ లాంటి పార్టీ అయితే ఇప్పటికే మీడియా సమావేశాలు పెట్టి సంజయ్ పరువు తీసే వాళ్లు. కానీ జాతీయ నాయకత్వానికి భయపడి.. సంజయ్ విషయాన్ని రచ్చ కాకుండా చూస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈటల, కిషన్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్‌కు సంజయ్ వ్యవహారశైలిని వివరించారు. ఇలా అయితే పార్టీలో పని చేయడం కష్టం అవుతుందని.. ఇతర నాయకులను అడ్డుకుంటూ అంతా తానై వ్యవహరిస్తుండటంతో కార్యకర్తల్లో కూడా అసహనం పెరుగుతోందని ఫిర్యాదు చేశారు. అయితే హైకమాండ్ ఇంత వరకు ఈ విషయంలో సంజయ్‌ను హెచ్చరించలేదు. కానీ అణచివేతకు గురవుతున్న నాయకులను మాత్రం బుజ్జగిస్తూ.. న్యాయం చేస్తామని మాట ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  20 Sep 2022 5:01 AM GMT
Next Story