Telugu Global
Telangana

ఆ ఒక్కటీ అడక్కు.. బండికి నెటిజన్ల రివర్స్ పంచ్

"ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ అడిగినా ఇవ్వలేదు, పెద్దాసుపత్రుల హామీకి దిక్కులేదు, అడక్కపోయినా చేనేతకు జీఎస్టీ అంటగట్టారు.." అంటూ బీజేపీకి గట్టిగానే బదులిస్తున్నారు నెటిజన్లు.

ఆ ఒక్కటీ అడక్కు.. బండికి నెటిజన్ల రివర్స్ పంచ్
X

మునుగోడులో సభలు, సమావేశాలు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి సోషల్ మీడియాలో హడావిడి చేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ''ఆ ఒక్కటీ అడక్కు'' అంటూ బండి సంజయ్ కాస్త కామెడీగా పోస్టర్లు తయారు చేయించారు. బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తో కలసి ''ఆ ఒక్కటీ అడక్కు'' పోస్టర్లు విడుదల చేశారు. అయితే ఇలా బీజేపీ క్యాంపెయిన్ మొదలైందో లేదో, అలా సోషల్ మీడియాలో రివర్స్ పంచ్ లు పడ్డాయి.

సీఎం కేసీఆర్ పై కామెడీ చేయాలనుకున్న బండి సంజయ్ కి నెటిజన్ల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ని హామీల గురించి ప్రజలు అడిగినట్టు, ఆయన ''ఆ ఒక్కటీ అడక్కు'' అంటూ సమాధానం ఇచ్చినట్టు బీజేపీ పోస్టర్లు తయారు చేయించింది. అయితే నెటిజన్లు మాత్రం తమ దగ్గరకు వచ్చి ''మా ఓటు మాత్రం అడక్కు'' అంటూ బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు. మీరు కేసీఆర్ ని ఎన్ని ప్రశ్నలైనా వేయండి, కానీ మమ్మల్ని మాత్రం ఆ ఒక్కటీ అడక్కండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. బీజేపీ ఎంత అభ్యర్థించినా తాము రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయబోమని చెబుతున్నారు.

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు అడిగామా ?, ఎమ్మెల్యేలతో 100 కోట్ల రూపాయల బేరసారాలు చేయమన్నామా? అంటూ బీజేపీని నిలదీస్తున్నారు నెటిజన్లు. "ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ అడిగినా ఇవ్వలేదు, పెద్దాసుపత్రుల హామీకి దిక్కులేదు, అడక్కపోయినా చేనేతకు జీఎస్టీ అంటగట్టారు.." అంటూ గట్టిగానే బదులిస్తున్నారు. మొత్తమ్మీద ''ఆ ఒక్కటీ అడక్కు'' అంటూ బీజేపీ మొదలు పెట్టిన ప్రచారం ఇప్పుడు వారికే రివర్స్ లో తగులుతోంది. మా ఓటు మాత్రం అడక్కండి అంటూ నెటిజన్లు బీజేపీ గాలి తీసేశారు.

First Published:  29 Oct 2022 2:28 PM GMT
Next Story