Telugu Global
Telangana

బూట్లు వేసుకుంటే నో ఎంట్రీ.. గ్రూప్-1 ప్రిలిమ్స్ కి కఠిన నిబంధనలు

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా చెప్పులు ధరించి రావాలని అధికారులు చెబుతున్నారు. బూట్లు ధరించి వస్తే పరీక్ష హాల్ లోనికి రానివ్వబోమంటున్నారు.

బూట్లు వేసుకుంటే నో ఎంట్రీ.. గ్రూప్-1 ప్రిలిమ్స్ కి కఠిన నిబంధనలు
X

ఈసారి తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వణకు కఠిన నిబంధనలు తెరపైకి తెచ్చారు అధికారులు. పేపర్ లీకేజీ వ్యవహారంతో గతంలో పెట్టిన పరీక్ష రద్దు కావంతో ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నిబంధనలు కూడా కఠినంగా ఉన్నాయి. జేఈఈ పరీక్షల సమయంలో ఉన్న నిబంధనలను గ్రూప్-1 కి కూడా అప్లయ్ చేస్తున్నారు TSPSC అధికారులు. అభ్యర్థులు బూట్లు వేసుకుంటే పరీక్ష హాల్ లోనికి రానివ్వబోమని చెబుతున్నారు.

తెలంగాణలో ఈనెల 11 ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా చెప్పులు ధరించి రావాలని అధికారులు చెబుతున్నారు. బూట్లు ధరించి వస్తే పరీక్ష హాల్ లోనికి రానివ్వబోమంటున్నారు. అక్కడికి వచ్చాక హడావిడి చేయకుండా, ముందుగానే చెప్పులు ధరించి రావాలని సూచిస్తున్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకోసం తెలంగాణ వ్యాప్తంగా 994 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 10.15 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు. పెన్సిల్‌, ఇంక్‌ పెన్‌, జెల్‌ పెన్‌, క్యాలిక్యులేటర్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ లను మాత్రమే అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. హాల్‌ టికెట్‌ తో పాటు పాస్‌ పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌, డ్రైవింగ్ లైసెన్స్.. లలో ఏదో ఒక గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఓఎంఆర్‌ షీట్‌ లో తప్పులు సరిచేసేందుకు వైట్‌ నర్‌, చాక్‌ పౌడర్‌, బ్లేడ్‌, ఎరేజర్‌ లాంటివి వాడితే డిస్ క్వాలిఫై చేస్తామన్నారు.

First Published:  9 Jun 2023 8:07 AM GMT
Next Story