Telugu Global
Telangana

రాష్ట్రాలను నిందించడం మానేయండి, ఇంధనంపై సెస్ రద్దు చేయండి: కేంద్రంపై కేటీఆర్ మండిపాటు

మేము వ్యాట్‌ని ఎన్నడూ పెంచనప్పటికీ, తగ్గించడం లేదని కేంద్ర ప్రభుత్వం మా మీద నిందలు వేయడం అన్యాయం అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ మాట్లాడుతున్న కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ఆయన ట్వీట్ చేశారు.

రాష్ట్రాలను నిందించడం మానేయండి, ఇంధనంపై సెస్ రద్దు చేయండి: కేంద్రంపై కేటీఆర్ మండిపాటు
X

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలపై నిందలు వేస్తున్నందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం సెస్‌ను రద్దు చేసి రాష్ట్రాలకు పెట్రోల్ లీటరు రూ.70, డీజిల్ లీటర్ రూ.60 చొప్పున అమ్మడానికి వీలు కల్పించాలని అన్నారు. 2014 నుంచి తెలంగాణలో ఇంధనంపై వ్యాట్ పెంచలేదని ఆయన గుర్తు చేశారు.

గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు స్వల్పంగానే పెరిగాయని అన్నారు. నవంబర్ 2021 నుండి మే 2022 వరకు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రెండుసార్లు తగ్గించిందని పేర్కొంటూ, ఇంధనంపై వ్యాట్ ని తగ్గించనందుకు బిజెపియేతర పాలిత ఆరు రాష్ట్రాలను నిందించారు.

"పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్‌ను తగ్గిస్తే, ఆయా రాష్ట్రాల్లోని వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. వారి రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వ్యాట్‌ను విధిస్తూ ఉన్నందున ఆ రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది," అని ఆయన అన్నారు.

అయితే, మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగాయని అన్నారు.

"మేము వ్యాట్‌ని ఎన్నడూ పెంచనప్పటికీ, తగ్గించడం లేదని మా మీద నిందలు వేయడం అన్యాయం. ప్రధాని మోడీ మాట్లాడుతున్న కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? తెలంగాణ 2014 నుండి ఇంధనంపై వ్యాట్‌ను పెంచలేదు " అని ఆయన ట్వీట్ చేశారు.


First Published:  15 Dec 2022 4:22 PM GMT
Next Story