Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీలో స్తబ్దత.. కనిపించని ఎన్నికల ఉత్సాహం

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు చేసినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైగా గతంలో కంటే ఇప్పుడు నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నది.

తెలంగాణ బీజేపీలో స్తబ్దత.. కనిపించని ఎన్నికల ఉత్సాహం
X

ఎన్నికల అనగానే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తం అవుతాయి. క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి పోటీ చేయాలని భావించే ఆశావహుల వరకు అందరూ ఉత్సాహంగా పని చేయడం మొదలు పెడతారు. ఒక సీటు గెలిచే అవకాశం ఉన్న పార్టీల నుంచి 100 సీట్లు గెలుస్తామనే పార్టీ వరకు కూడా ఎన్నికల కోసం వ్యూహాలు మొదలు పెడతాయి. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న.. దేశంలో బలమైన పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ పరిస్థితి మాత్రం తెలంగాణలో అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం ఉన్నా పార్టీలో స్తబ్దత పెరిగిపోయింది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు చేసినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైగా గతంలో కంటే ఇప్పుడు నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నది. పైగా కిషన్ రెడ్డి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వంటి ప్రభావం చూపగలిగే నాయకులు పార్టీని వీడిపోయారు. బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకుంటుందనే నమ్మకం లేకపోవడం.. ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనే కారణంతో వేరే మార్గాలు వెతుక్కుంటున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే చాలా మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగో దరఖాస్తు ఉచితమే కాబట్టి.. కొంత మంది గల్లీ లీడర్లు కూడా టికెట్ల కోసం అప్లయ్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా పోటీ ఇచ్చే బలమైన బీజేపీ నాయకులు ఎవరూ కనపడటం లేదు.

బీజేపీలోకి చాలా మంది ఇతర పార్టీల నాయకులు వలస వస్తారని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈటల రాజేందర్‌ను చేరికల కమిటీ చైర్మన్‌గా నియమించిన తర్వాత కూడా బలమైన నాయకులు ఎవరూ పార్టీలోకి రాలేదు. ఒక విధంగా రాజేందర్ ఆ పదవిలో ఫెయిల్ అయ్యారని స్వయంగా బీజేపీ నాయకులే చెబుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వం బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉత్సాహంగా దూసుకొని పోతుంటే.. బీజేపీ మాత్రం ఉన్న నాయకులను పోగొట్టుకుంటూ డీలా పడిపోయింది.

ఎన్నికలు సమీపిస్తున్నా.. మేనిఫెస్టో విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని ఇంత వరకు బీజేపీ సూత్రప్రాయంగా కూడా చెప్పడం లేదు. దీంతో క్షేత్ర స్థాయి క్యాడర్‌లో కూడా ఎలాంటి ఉత్సాహం కనపడటం లేదు. తెలంగాణ బీజేపీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కాడి వదిలేసిందని.. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను లైట్‌గా తీసుకున్నదని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో అమిత్ షా, మోడీ పర్యటనలు ఉంటాయని చెప్పినా.. ఇంత వరకు వాటి ఊసే లేదు. ఖమ్మంలో అమిత్ షా సభ రెండు సార్లు వాయిదా వేసి.. చివరకు నిర్వహించినా.. ప్రజల నుంచి స్పందన రాలేదు. తాజాగా సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేసింది. దీని తర్వాత అయినా బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందో రాదో వేచి చూడాలి.

First Published:  7 Sep 2023 5:13 AM GMT
Next Story