Telugu Global
Telangana

ST రిజర్వేషన్లు: బీజేపీ ద్వంద వైఖరి...తెలంగాణ పట్ల వివక్ష‌

ST రిజర్వేషన్ల పట్ల బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కానీ అదే పార్టీ పరిపాలిస్తున్న కర్నాటకలో ఎస్టీల రిజర్వేషన్లను మూడు శాతం నుండి ఏడు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

ST రిజర్వేషన్లు: బీజేపీ ద్వంద వైఖరి...తెలంగాణ పట్ల వివక్ష‌
X

బీజేపీ ద్వంద ప్రమాణాలు ఎలా ఉంటాయో ఈ దేశ ప్రజలు చాలా కాలంగా రుచి చూస్తున్నారు. తెలంగాణ పరజలకైతే ఇది చాలాకాలంగా అనుభవంలో ఉన్న అంశం. ఎస్టీ రిజర్వేషన్లపై ఆ పార్టీ ద్వంద వైఖరి ఎలాంటితో బైటపెట్టే సంఘటన ఒక్క సారి చూద్దాం. ఈ ద్వంద వైఖరిలో తెలంగాణ పట్ల వివక్ష కూడా బహిర్గతమవుతుంది.

2017,ఏప్రిల్ 16న తెలంగాణ అసెంబ్లీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో ఆరు శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం కోరడంతో పాటు, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఐదేళ్ళు గడిచిపోయింది కానీ ఆ బిల్లు విషయంలో కేంద్రం చడీచప్పుడు చేయడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఐదేళ్లకు పైగా బిల్లుకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపించారు.

"ఇప్పటికైనా ఎస్టీల రిజర్వేషన్ కోటాను పెంచడమో లేదా దానిని తన మెడకు ఉచ్చుగా మార్చుకోవడమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చుకోవాలి. లేదంటే ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుంది'' అని కేసీఆర్ అన్నారు.

సరే, తెలంగాణ విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష కొత్తదేం కాదు. అయితే అదే బీజేపీ పరిపాలిస్తున్న కర్నాటక ఇప్పుడు తెలంగాణ బాటలో నడిచి ఎస్టీ రిజర్వేషన్ కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను ఆరు శాతం నుండి 10 శాతానికి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత‌ కేవలం పక్షం రోజుల తర్వాత, కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దానిని అనుసరించాలని నిర్ణయించుకుంది.

కర్నాటకలో 2019లో ఏర్పాటైన జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ, కర్ణాటక ప్రభుత్వానికి రిజర్వేషన్ల పెంపును సిఫార్సు చేస్తూ తన నివేదికను సమర్పించిన రెండేళ్ల తర్వాత ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేసిన తర్వాత కర్నాటక ఈ నిర్ణయం తీసుకుంది.

ఆయా కమ్యూనిటీల‌ నుండి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం, గత వారం జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశం తరువాత, ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుండి 17 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను మూడు శాతం నుండి ఏడు శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని సూచిస్తూ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ తన నివేదికను జూలై 2020లో సమర్పించింది.

''ఇది దళితుల సంక్షేమం పట్ల బిజెపి అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ 2017లో బిల్లును ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును పక్కనపడేయడం రాజకీయ ప్రేరేపిత చర్య.'' ఓ దళిత మేదావి స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిల్లును అమలు చేయవచ్చ‌ని జస్టిస్ నాగమోహన్ దాస్ కర్నాటక ప్రభుత్వానికిచ్చిన‌ నివేదికలో పేర్కొన్నారు.

జస్టిస్ దాస్ ప్రకారం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఎప్పుడో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటాయి.

ఒకే పార్టీ రెండు విధానాలు ఒక్క బీజేపీకి మాత్రమే చెల్లింది.

First Published:  12 Oct 2022 8:11 AM GMT
Next Story