Telugu Global
Telangana

క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం.. ఎంఎన్‌జే ఆసుపత్రిలో ప్రత్యేక పాఠశాల

సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి.. ఎంఎన్‌జే ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం.. ఎంఎన్‌జే ఆసుపత్రిలో ప్రత్యేక పాఠశాల
X

క్యాన్సర్‌తో బాధపడే రోగులు చికిత్సకు వచ్చినప్పుడు.. వారి పిల్లలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులకు ఎంఎన్‌జే ఆసుపత్రి పూర్తి స్థాయి ఆంకాలజీ సేవలు అందిస్తోంది. నిత్యం ఇక్కడకు రాష్ట్రం నలుమూలల నుంచి పేషెంట్లు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. రోజుల తరబడి కీమో థెరపీ చేయించుకోవడానికి ఇక్కడే ఉంటున్నారు. క్యాన్సర్ తీవ్రత పెరిగిన కొంత మంది ఇన్‌పేషెంట్లుగా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. దీని వల్ల క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరం అవుతున్నట్లు గుర్తించారు. అందుకే సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి.. ఎంఎన్‌జే ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

సుదీర్ఘ కాలం క్యాన్సర్ చికిత్స తీసుకునే బాధితుల పిల్లల చదువు దెబ్బతినకుండా ఆసుపత్రి ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రి యాజమాన్యం కూడా సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇందుకు అవసరమైన సహకాన్ని అందిస్తామని పేర్కొన్నది. విద్యార్థుల చదువు పాడవకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.

త్వరలోనే విద్యా శాఖ అధికారులు, ఎంఎన్‌జే ఆసుపత్రి యాజమాన్యం కలసి పాఠశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అన్ని రెగ్యులర్ స్కూల్స్ లాగానే ఇక్కడ కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత విద్యా శాఖ తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఎన్నో తరగతి వరకు క్లాసులను ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

First Published:  19 May 2023 1:13 PM GMT
Next Story