Telugu Global
Telangana

విదేశీ క్రిమినల్స్ కోసం తెలంగాణలో స్పెషల్ సెంటర్

ప్రస్తుతం ఉన్న తాత్కాలిక డిటెన్షన్ సెంటర్ స్థానంలో శాశ్వత డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు.

విదేశీ క్రిమినల్స్ కోసం తెలంగాణలో స్పెషల్ సెంటర్
X

విదేశీ క్రిమినల్స్‌ను తిరిగి వాళ్ల దేశానికి పంపించే ముందు(డిపోర్ట్).. వారిని ఉంచేందుకు గాను ప్రత్యేక సెంటర్ నెలకొల్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రవాణా, అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక డిటెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సదరు క్రిమినల్స్‌ను డిపోర్ట్ చేసే ముందు వారికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు.. ఇతర డాక్యుమెంట్ల ఏర్పాటు అవసరం. ఇందుకు కొంత సమయం పడుతుంది. వాళ్లను ఇలాంటి డిటెన్షన్ సెంటర్‌లో ఉంచాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం ఉన్న తాత్కాలిక డిటెన్షన్ సెంటర్ స్థానంలో శాశ్వత డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 40 మంది కెపాసిటీతో ఉండే డిటెన్షన్ సెంటర్‌ను హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దేశంలోకి వచ్చిన విదేశీయులు ఏదైనా నేరం చేసినా, వీసా గడువు ముగిసిన తర్వాత నివసిస్తున్నా.. వారిని డిపోర్ట్ చేయాలంటే ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ) ద్వారా తగిన అనుమతులు తీసుకోవాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో వీళ్లను డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు.

ఒక సారి ఈ డిటెన్షన్ సెంటర్‌లోకి వస్తే.. వారు ఇక బయటకు వచ్చే వీలుండదు. డాక్యుమెంట్లు మొత్తం సిద్దం చేసి.. వారిని నేరుగా ఎయిర్‌పోర్టుకు పంపుతారు. అక్కడ విమానం ఎక్కించి.. వారి సంబంధిత దేశానికి చెందిన పోలీసులకు అప్పగిస్తారు. తీవ్రమైన నేరాలు చేస్తే.. వాళ్లకు మన దేశంలోనే శిక్షలు పడే అవకాశముంది. ఇప్పటి వరకు దేశంలో ఢిల్లీ, కర్నాటక, అస్సాంలో మాత్రమే ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో కూడా ఒకటి ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న సీసీఎస్ డిటెన్షన్ సెంటర్‌లో కేవలం ఐదుగురు విదేశీయులను మాత్రమే ఉంచే వీలుంది. దీనివల్ల వారి భద్రత, ఇతర విషయాల్లో పోలీసులకు ఇబ్బంది కలుగుతోంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా, కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రత్యేక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు అవసరం ఉన్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. దీనికి అనుగుణంగానే సీఎస్.. వికారాబాద్‌లో డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో డ్రగ్స్ కేసులు వెలుగు చూసినప్పుడే సీఎం కేసీఆర్ ఇలాంటి డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలోనే వికారాబాద్ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు బీజం పడింది.

ఎఫ్ఆర్ఆర్ఓతో రిజిస్టర్ అయిన 750 మంది విదేశీయుల జాడ తెలియడం లేదని పోలీసులు చెప్తున్నారు. వీరందరినీ గుర్తించే పనిలో పడ్డారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వీళ్లు దేశంలోనే నివసిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం డిటెన్షన్, డిపోర్టింగ్, విమాన టికెట్లు, ఇతర ఖర్చులు పోలీసులే భరిస్తున్నారు. గత రెండు నెలల్లోనే వీరి ఖర్చు దాదాపు రూ. 6 లక్షలు అయ్యింది. అయితే డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే.. ఆ ఖర్చులన్నీ జైళ్ల శాఖ బడ్జెట్ ద్వారా సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

First Published:  16 July 2022 7:02 AM GMT
Next Story