Telugu Global
Telangana

ఆదాయంలో పాత రికార్డ్ బద్దలు కొట్టిన దక్షిణ మధ్య రైల్వే

దేశవ్యాప్తంగా రైల్వేకు 18 జోన్లు ఉన్నాయి. అందులో దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం.

ఆదాయంలో పాత రికార్డ్ బద్దలు కొట్టిన దక్షిణ మధ్య రైల్వే
X

ఇటీవల దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి వెంట వెంటనే రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టడం గురించి కేంద్రంలోని బీజేపీ గొప్పలు చెప్పుకుంది. అయితే ఇది సౌత్ సెంట్రల్ రైల్వేపై కేంద్రానికి ఉన్న ప్రత్యేక ప్రేమ కాదని, ఇక్కడినుంచి వచ్చే ఆదాయాన్ని బట్టే ఇక్కడ ఖర్చుకు కేంద్రం వెనకాడటంలేదని తేలింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత ఆర్థిక సంవత్సరంలో కూడా దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ స్థాయిలో ఆదాయం సంపాదించింది. కరోనాకి ముందు ఉన్న రికార్డులు కూడా ఈ దెబ్బతో బద్దలయ్యాయి.

దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్లు, ఎక్స్ ప్రెస్ లు, గూడ్స్ రైళ్ల ద్వారా మొత్తం రూ.18,973 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇప్పటి వరకూ 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రూ.15,708 కోట్లు బెంచ్ మార్క్ గా ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా దాటేసింది. 2021–22లో 14,266.04 కోట్లు ఆదాయం పడిపోగా.. ఈసారి మాత్రం పాత రికార్డులు బద్దలు కొడుతూ ఏకంగా రూ.19 వేల కోట్లకు ఆదాయం చేరడం విశేషం.

దేశంలో ఐదో స్థానం..

దేశవ్యాప్తంగా రైల్వేకు 18 జోన్లు ఉన్నాయి. అందులో దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. మొదటి స్థానాన్ని ఉత్తర రైల్వే నిలబెట్టుకుంది. మధ్య రైల్వేకి రెండో స్థానం, దక్షిణ రైల్వేకి మూడో స్థానం, పశ్చిమ రైల్వే నాలుగో స్థానంలో ఉండగా, దక్షిణ మధ్య రైల్వే ఐదో స్థానంలో నిలిచింది. సరకు రవాణాతో రూ.­13,051.10 కోట్లు, ప్రయాణికుల రైళ్ల ద్వారా రూ.5,140.70 కోట్లు ఆదాయం లభించినట్టు తెలిపారు అధికారులు. కరోనాతోపాటు, సర్వీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 12.70 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించగా గడచిన ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సేవల్ని 25.56 కోట్ల మంది ఉపయోగించుకున్నారు.

First Published:  18 April 2023 4:59 AM GMT
Next Story