Telugu Global
Telangana

అసౌకర్యానికి మన్నించండి.. హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

విజేతకు మంత్రి కేటీఆర్ బహుమతి ప్రదానం చేశారు. ఫార్ములా ఈ-రేస్ కారణంగా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని తెలిపారు.

అసౌకర్యానికి మన్నించండి.. హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
X

ప్రపంచంలోని అతి పెద్ద నగరాల్లో మాత్రమే జరిగే ఫార్ములా ఈ-రేస్ పోటీలకు తొలి సారిగా హైదరాబాద్ వేదికైన విషయం తెలిసిందే. సిటీ ట్రాక్ మీద జరిగిన ఈ పోటీలు విజయవంతంగా ముగిశాయి. శనివారం జరిగిన రేసులో ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు దాదాపు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వెళ్లాయి. 11 టీమ్స్‌కు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొనగా.. జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. ఇక రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. మహీంద్రా రేసింగ్‌కు చెందిన ఆలివర్ రోలాండ్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఫార్ములా ఈ-రేస్‌ను వీక్షించడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర నగరాల నుంచి కూడా అభిమానులు హాజరయ్యారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, యజువేంద్ర చాహల్, శిఖర్ ధావన్ కూడా రేసును చూడటానికి వచ్చారు. సినీ నటులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యష్ తదితరులు వచ్చారు. కాగా విజేతకు మంత్రి కేటీఆర్ బహుమతి ప్రదానం చేశారు. ఫార్ములా ఈ-రేస్ కారణంగా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని తెలిపారు. అయితే ఈ పోటీల కారణంగా నగరవాసులకు కలిగిన అసౌకర్యానికి మన్నించమని విజ్ఞప్తి చేశారు.

దేశంలో తొలి మొబిలిటీ వ్యాలీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ మీద అవగాహన కలగడానికి కూడా ఈ-రేస్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో రేసులు జరుగుతుండగా.. ఇండియా నుంచి హైదరాబాద్ హోస్ట్‌గా వ్యవహరించడం సంతోషకరమని కేటీఆర్ చెప్పారు.

కాగా ఫార్ములా ఈ-రేస్ పోటీలు దిరియా, మెక్సికో సిటీ, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సోల్ వంటి నగరాల్లో ప్రతీ ఏటా జరుగుతాయి. ఇకపై హైదరాబాద్ కూడా ఒక హోస్ట్‌గా ఉండబోతోంది. ఇందుకోసం దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడినా.. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ-రేసింగ్ హైదరాబాద్‌కు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ నగరంలో ఒక్కో రేస్ చొప్పున మొత్తం 16 రేసులు జరుగుతాయి. వాటిలో లభించిన పాయింట్లను లెక్కించి.. సీజన్ చివరిలో ప్రపంచ విజేతను ప్రకటిస్తామని నిర్వాహకులు చెప్పారు.తర్వాతి రేసింగ్ సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగనున్నది.




First Published:  11 Feb 2023 12:42 PM GMT
Next Story