Telugu Global
Telangana

హైదరాబాద్ గ్రేట్.. ఆ 10 కారణాలు ఇవే..

ఇప్పుడు హైదరాబాదే బెస్ట్ అంటున్నారు టెకీలు. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కాదు, ఇతర రంగాలవారికి కూడా హైదరాబాద్ నచ్చినంతగా బెంగళూరు ఆనట్లేదు.

హైదరాబాద్ గ్రేట్.. ఆ 10 కారణాలు ఇవే..
X

బెెంగళూరుకి సిలికాన్ సిటీగా పేరుంది. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలంటే కేరాఫ్ అడ్రస్ బెంగళూరు అని చెప్పేవారు. బెంగళూరు సిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుందనే పేరుంది. కానీ ఇప్పుడు హైదరాబాదే బెస్ట్ అంటున్నారు టెకీలు. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కాదు, ఇతర రంగాలవారికి కూడా హైదరాబాద్ నచ్చినంతగా బెంగళూరు ఆనట్లేదు. ఇంతకీ హైదరాబాద్ ఎందులో గొప్ప అంటే.. 10 కారణాలు టకీమని చెబుతున్నారు.

కారణం నెంబర్ 1 - ట్రాఫిక్

హైదరాబాద్ తో పోల్చి చూస్తే బెంగళూరులో ట్రాఫిక్ నరకంగా ఉంటుందని అంటున్నారు ఉద్యోగులు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఓటీటీ వెబ్ సిరీస్ ని జర్నీ టైమ్ లో ఈజీగా చూసేయొచ్చని, ఆ విధంగా ఈ ట్రాఫిక్ మంచిదేనని జోకులు పేలుస్తున్నారు.

నెంబర్ 2 - సినిమా టికెట్ రేట్ల మోత

సినిమా టికెట్ రేట్లు హైదరాబాద్ తో పోల్చుకుంటే బెంగళూరులో భారీగా ఉంటాయట. ఇక్కడ అన్ని సినిమాలకు బెనిఫిట్ షో లు ఉంటాయన్నమాటే కానీ, బెంగళూరులో ఒక సినిమా చూసే బదులు, హైదరాబాద్ లో అదే టికెట్ రేటుతో మూడు సినిమాలు చూడొచ్చని అంటున్నారు.

నెంబర్ 3 - పార్కింగ్ ఫీజుల మోత

హైదరాబాద్ లో మాల్స్ అయినా, సినిమా థియేటర్స్ అయినా కొన్నిచోట్ల తొలి రెండు గంటలు పార్కింగ్ ఫ్రీ, ఆ తర్వాత నామమాత్రపు చార్జీలుంటాయి. బెంగళూరులో మాత్రం గంటకి 50 చదివించుకోవాల్సిందే. ఒకవేళ ఆమాత్రం ఖర్చు పెట్టడానికి సిద్ధమైనా పార్కింగ్ ప్లేస్ దొరకదని అంటున్నారు. అలా దొరికిన ప్లేస్ లో పార్కింగ్ చేసి, తిరిగొచ్చే టైమ్ లో మరో మాంచి సినిమా చూసేయొచ్చట.

నెంబర్ 4 - సింగిల్ రోడ్లతో నరకం..

హైదరాబాద్ పాతబస్తీలో కూడా ఇప్పుడు డబుల్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ బెంగళూరులో చాలా చోట్ల బిజీ కూడళ్లలో కూడా సింగిల్ రోడ్లే ఉంటాయి. హైదరాబాద్ లో వన్ వే ట్రాఫిక్ కి అలవాటు పడి, బెంగళూరులో ఒకే రోడ్డులో ఎదురొచ్చే వాహనాలను తప్పించుకుని వెళ్లడం కష్టమంటున్నారు.

నెంబర్ 5 - అద్దె ఇళ్లతో నరకం..

బెంగళూరులో ఇల్లు అద్దెకి కావాలంటే 10నెలల అడ్వాన్స్ ముందే కట్టాలట. రెంట్ అగ్రిమెంట్ తో మరిన్ని కష్టాలని అంటున్నారు. అక్కడ ఇల్లు అద్దెకి తీసుకునే బదులు ఒక కొత్త బైకో, సెకండ్ హ్యాండ్ కారో కొనుక్కోవచ్చని సెటైర్లు వేస్తున్నారు ఉద్యోగులు.

నెంబర్ 6 - యు టర్న్స్ తో కష్టం

బెంగళూరులో పొరపాటున మనం బండి ఆపాల్సిన చోటు దాటి కాస్త ముందుకెళ్లామా ఇక మనం బుక్కయిపోయినట్టే. యు టర్న్ కోసం కిలోమీటర్ల కొద్దీ ముందుకెళ్లాల్సిందే. అసలు యు టర్న్ అనే సినిమా కథకి బెంగళూరే మూలం కాబోలు అంటున్నారు.

నెంబర్ 7 - వర్షాలు..

హైదరాబాద్ లో కూడా వర్షాలతో సమస్య ఉంటుంది కానీ, బెంగళూరులో అది ఏడాదిపాటు ఉంటుందట. ప్రతి రోజూ అక్కడ సాయంత్రం 6 దాటితే వర్షం పలకరిస్తుందట. దీనిపై కూడా సెటైర్లు పడుతున్నాయి.

నెంబర్ 8 - ఎయిర్ పోర్ట్..

బెంగళూరు ఎయిర్ పోర్ట్ బెంగళూరులో లేదు అంటే జోక్ అనుకోవద్దని అంటున్నారు ఉద్యోగులు. అది నిజమేనట. అదెక్కడో బెంగళూరునుంచి విసిరేసినట్టు ఊరి చివర ఉంటుందట. సెక్యూరిటీ చెకింగ్ లు.. లోకల్ ట్రావెల్ టైమ్ అంతా కలుపుకుంటే.. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి కార్ లోనే ఫాస్ట్ గా రావొచ్చట.

నెంబర్ 9 - డ్రైవర్లతో తంటా..

బెంగళూరులో ఆటో, బస్ డ్రైవర్లతో యమా డేంజర్ అంటున్నారు. వారిని ఓవర్ టేక్ చేసినా, ఫాలో అయినా మన బండికి స్క్రాచ్ పడటం ఖాయమంటున్నారు. పొరపాటున డ్యాష్ ఇస్తే, మనం నాన్ లోకల్ అని తెలిస్తే ఇక మనల్ని ఊరికే వదిలిపెట్టరని అంటున్నారు.

నెంబర్ 10 - వాతావరణం

ఇక బెంగళూరు వాతావరణం చాలా బాగుంటుందని వాట్సప్ స్టేటస్ లలో చాలామంది పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ సైనస్ సమస్య ఉన్న వారికి, చల్లటి వాతావరణం పడనివారికి మాత్రం బెంగళూరు నరకమేనంటున్నారు.

ఇదీ క్లుప్తంగా బెంగళూరు పరిస్థితి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కమ్ రచయిత ధీరజ్ బాబు ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీపై బెంగళూరు వెళ్లారట. ఏడాదయినా అక్కడ సెట్ కావడం తనవల్ల కావట్లేదని, హైదరాబాద్ ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనుకుంటున్నానని ట్విట్టర్లో ఓ పోస్టింగ్ పెట్టారు ధీరజ్. అంతే కాదు, 10 కారణాలు చెబుతూ.. సినిమా క్లిప్పింగ్స్ తో మాంచి ఫన్ జోడించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ధీరజ్ ట్వీట్‌ ని అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ లో నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్నారు.

First Published:  27 Aug 2022 7:28 AM GMT
Next Story