Telugu Global
Telangana

చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది.. ఇవేనా హైలైట్లు

"చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది.. ఇవేనా హైలైట్లు." అంటూ మీడియా ప్రతినిధులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది.. ఇవేనా హైలైట్లు
X

వారం రోజులుగా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వీడియోలు, ఆమెకు సంబంధించిన వార్తలు హైలైట్ గా మారాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో మహిళ ఆవేదన అంతకు మించి హైలైట్ గా మారింది. మీడియాకు, సోషల్ మీడియాకు ఆమె క్లాస్ తీసుకున్నారు. అసలు మీడియా చెప్పాల్సిందేంటి..? ఇప్పుడు దేని వెంట పడుతున్నారు..? అంటూ ఆమె నిలదీశారు. రోడ్డు పక్కన చిరువ్యాపారుల్ని కాస్త బతకనీయండి అని ఆమె చెబుతున్న మాటలు ప్రతి ఒక్కర్నీ ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


కేవలం రేటింగ్ కోసమే మీడియా, సోషల్ మీడియా.. కుమారి ఆంటీ వెంట పడుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాస్తో కూస్తో ఆమెకు మేలు జరిగినా, ఆ తర్వాత కీడు కూడా జరిగింది. పోలీసులు హోటల్ ఎత్తివేయమనడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చివరకు హోటల్ నిలబడినా.. నిరుద్యోగులు వచ్చి నిరసన తెలపడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. బిజినెస్ చేయడం కంటే ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికే ఆమెకు టైమ్ సరిపోతోంది. ఈ క్రమంలో ఈ వింత పోకడపై మరో మహిళ ఆవేదన సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.

"మీరిక్కడకు రావొద్దమ్మా, వారిని హైలైట్ చేయొద్దమ్మా, మీరెందుకు మమ్మల్ని హైలైట్ చేస్తారమ్మా..? మమ్మల్ని బతకనీయండి. మీ వృత్తి ఇదే అయితే అన్యాయాలు జరిగే దగ్గరకు వెళ్లండి, అక్రమాలు జరిగే దగ్గరకు వెళ్లండి, రేప్ లు జరుగుతున్నాయి.. బాధితుల దగ్గరకు వెళ్లండి, గంజాయి అమ్మేవారి దగ్గరకు వెళ్లండి. చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది.. ఇవేనా హైలైట్లు." అంటూ మీడియా ప్రతినిధులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

First Published:  5 Feb 2024 6:00 AM GMT
Next Story