Telugu Global
Telangana

తెలంగాణ పట్ల ఇంత విద్వేషమా ?

డైరెక్ట్ గా జవాబు ఇవ్వాల్సిన ఒక ప్రశ్నపై సరి అయిన జవాబు ఇవ్వకుండా తెలంగాణ భాషా నైపుణ్యాన్ని ఎగతాళి చేయడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

తెలంగాణ పట్ల ఇంత విద్వేషమా ?
X

ఈ దేశంలో హిందీ మాట్లాడటం సరిగా రాకపోతే, లేదా పూర్తిగా రాకపోతే వివక్షకు, ఎగతాళికి గురి కావాల్సిందేనా ? బీజేపీ ఈ దేశ ప్రజలకు నేర్పిస్తున్న సంస్కృతి ఇదేనా ? తెల‍ంగాణ పట్ల అన్ని రంగాల్లోనూ వివక్ష చూపుతున్న కేంద్ర బీజేపీ సర్కార్ ఇక్కడి భాష, సంస్కృతుల పట్ల కూడా వివక్ష చూపిస్తుందనడానికి నిన్న పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు రుజువు కావా ? ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు.

డైరెక్ట్ గా జవాబు ఇవ్వాల్సిన ఒక ప్రశ్నపై సరి అయిన జవాబు ఇవ్వకుండా తెలంగాణ భాషా నైపుణ్యాన్ని ఎగతాళి చేయడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

నిన్న లోక్ సభలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి...ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి 'ఐసియులో' ఉందని చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, ఐసియు నుండి రూపాయిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావడానికి కేంద్రం వద్ద ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు.

రేవంత్ హిందీలో వేసిన ఆ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డైరెక్ట్ గా సమాధానమివ్వవచ్చు. తమ ప్రభుత్వం ఈ దేశ‌ ఆర్థిక వ్యవ‌స్థను ఎంత గొప్పగా పరుగులు పెట్టిస్తిందో పార్లమెంటు సభ్యులను, ప్రజలను నమ్మించే విధంగా మాట్లాడవచ్చు. కానీ ఆమె ఎందుకు అసహనానికి గురయ్యారో తెలియదు. బీజేపీ సభ్యురాలు కాగానే ఆమె తాను కూడా దక్షిణాది బిడ్డనని మర్చిపోయి, కాషాయీకరణ చెందిన ఆమె తెలంగాణ ప్రజల భాషా నైపుణ్యాన్ని కించపరుస్తూ, ఎగతాళి చేస్తూ, అవమానిస్తూ మాట్లాడారు.

"జో తెలంగాణా సే ఆతే హై, ఉన్కే హిందీ కమ్జోర్ బోల్రే. మేరా హిందీ భీ కమ్జోర్ హై, ఫిర్ భీ కమ్జోర్ హిందీ కో కమ్జోర్ హిందీ మెయిన్ జవాబ్ దే రహీ హూ…" (తెలంగాణ నుంచి వచ్చే సభ్యుల హిందీ బలహీనంగా ఉంటుంది. నా హిందీ కూడాబలహీనంగానే ఉంటుంది. బలహీనమైన హిందీకి బలహీనమైన‌ హిందీలోనే జవాబిస్తాను) అని ఆర్థిక మంత్రి అన్నారు.

ఇక్కడ ఆమె మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడిన హిందీ భాషనే కాదు తెలంగాణ ప్రజలందరినీ టార్గెట్ చేసుకుంది. మనసులో తెలంగాణ పట్ల, తెలుగు భాషపట్ల, ఇక్కడి సంస్కృతి పట్ల ఎంత చిన్నచూపు లేకపోతే ఇలా మాట్లాడుతారు అని సోషల్ మీడియాలో నెటిజనులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబేం చెప్తారు ?

ఆమె మాట్లాడిన మాటల‌ను సమర్థించుకోవడానికి బీజేపీ నాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన సొంత హిందీ కూడా బలహీనంగా ఉందని ఒప్పుకున్నారు కదా అని కాషాయ వర్గాలు కూనిరాగాలు తీస్తున్నాయి.

ఒక వైపు ఒకే దేశం ఒకే భాష అంటూ దేశంపై బలవంతంగా హిందీ భాషను రుద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ ఇతర భాషలు మాట్లాడే వారిని ఎగతాళి చేయడం చూస్తూ ఉంటే వారికి ప్రజల పట్ల, వారి భాష పట్ల, సంస్కృతి పట్ల ఎంత ద్వేషం ఉందో అర్దమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అంటే బీజేపీకి ఎంత చిన్న చూపు ఉందో దీన్నిబట్టి అర్దమవుతోందని సోషల్ మీడియాలో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయ దళం వేస్తున్న ఎత్తుగడలు, ఇతరులపై చూపిస్తున్న వివక్ష, ప్రజల పట్ల , వారి భాషా సంస్కృతుల పట్ల నరనరాన జీర్ణించుకున్న విద్వేషం, ప్రజల మధ్య సృష్టిస్తున్న విభేదాలు.... ఏ అగాధాలకీ ప్రస్థానం ?


First Published:  13 Dec 2022 3:28 AM GMT
Next Story