Telugu Global
Telangana

ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య.. - స్నేహితుడే హంత‌కుడు

చిన్నప్పటి నుంచి స్నేహితులైన ప్రసాద్, ప్రశాంత్‌లు మాట్లూరుకు చెందినవారు అయినప్పటికీ ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య.. - స్నేహితుడే హంత‌కుడు
X

స్నేహితుడి ఇంటిపై కన్నేసిన వ్యక్తి దానిని సొంతం చేసుకునేందుకు ఆ కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చాడు. వారం రోజుల వ్యవధిలోనే వీరందరినీ చంపేయడం గమనార్హం. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘాతుకానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా మాట్లూరుకు చెందిన ప్రసాద్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు దారిలేక ఆందోళనకు గురవుతున్న సమయంలో.. అతని ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం పొందవచ్చని అతని స్నేహితుడు ప్రశాంత్‌ చెప్పాడు. రుణం పొందే ప్రాసెస్‌ తేలిగ్గా జరుగుతుందని నమ్మించి ప్రసాద్‌ ఇంటిని తన పేరిట రాయించుకున్నాడు.

ఇంటిపై రుణం పేరుతో...

ఇంతా చేసి బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం మంజూరు కాలేదు. దీంతో ప్రసాద్‌ తన ఇంటిని తన పేరిట తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రశాంత్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఎలాగైనా ఆ ఇంటిని తానే దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఉన్న ప్రశాంత్‌ అందుకోసం ఏకంగా ప్రసాద్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్కరుగా ఆ ఇంటిలోని అందరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా రోజుల వ్య‌వ‌ధిలోనే ఆ కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు.

చంపిందిలా...

చిన్నప్పటి నుంచి స్నేహితులైన ప్రసాద్, ప్రశాంత్‌లు మాట్లూరుకు చెందినవారు అయినప్పటికీ ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రసాద్‌ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఉంటుండగా.. ప్రశాంత్‌ నిజామాబాద్‌ శివారులో ఉంటున్నాడు. ఇక హత్యలకు ప్రణాళిక వేసిన ప్రశాంత్‌ తొలుత ప్రసాద్‌ని తన వెంట తీసుకెళ్లి డిచ్‌పల్లి హైవే పక్కన హతమార్చాడు. మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత అప్పులిచ్చినవారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్‌ని అరెస్ట్‌ చేశారంటూ అతని భార్య రమణిని నమ్మించి పోలీస్‌స్టేషన్ నెపంతో ఆమెను తనవెంట తీసుకెళ్లాడు. అయితే ఆమెను బాసరలోని గోదావరి నది వద్దకు తీసుకెళ్లి అక్కడ హతమార్చి నదిలో పడేశాడు. అనంతరం ప్రసాద్‌ని, అతడి భార్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్‌ చెల్లిని తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె మృతదేహం ఇంకా పోలీసులకు లభ్యం కాలేదు. ఆ తర్వాత ప్రసాద్‌ తల్లికి మాయమాటలు చెప్పి.. అతడి పిల్లలిద్దర్నీ నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల సరిహద్దులోని సోన్‌ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి వారినీ చంపేశాడు. మృతదేహాలను అక్కడే కాల్వలో పడేశాడు. ప్రసాద్‌ కుటుంబంలో మిస్సయినవారంతా పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి అతని మరో సోదరిని కూడా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లిలో ఆమెకు నిప్పంటించి చంపేశాడు.

బయటపడిందిలా...

ఒకే కుటుంబంలోని వ్యక్తులను మాయమాటలు చెప్పి వరుసగా హత్య చేయడంతో పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ప్రసాద్‌ పిల్లల్లో ఒకరి మృతదేహం ఈనెల 8న పోలీసులకు లభించగా, మరొక‌టి సోమవారం లభ్యమైంది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో కుటుంబ సభ్యులందరూ మిస్సయినట్టు తేలింది. ప్రశాంత్‌పై అనుమానంతో విచారణ చేపట్టగా.. అతని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఘటనా స్థలాల్లో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది.

మరో విషయమేంటంటే.. మొదటి 3 హత్యలను తానొక్కడినే చేశానని చెప్పిన ప్రశాంత్‌, మిగిలినవి స్నేహితులతో కలసి చేసినట్టు అంగీకరించినట్టు తెలిసింది. ప్రస్తుతం నిందితులు నలుగురూ కామారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. స్నేహితుడే యముడై కుటుంబం మొత్తాన్ని హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

First Published:  18 Dec 2023 1:43 PM GMT
Next Story