Telugu Global
Telangana

సీబీఐ అవసరం లేదు.. హైకోర్టులో సిట్ దర్యాప్తు రిపోర్ట్

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌ ని సిట్, కోర్టుకి సమర్పించింది. పేపర్‌ లీకేజీ కేసులో రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు.

సీబీఐ అవసరం లేదు.. హైకోర్టులో సిట్ దర్యాప్తు రిపోర్ట్
X

TSPSC పేపర్ లీకేజీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. ప్రతిపక్షాలు సీబీఐ ఎంక్వయిరీని కోరాయి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కూడా రంగంలోకి దిగాలంటూ లేఖ రాశారు. అయితే ఈ కేసు విషయంలో సీబీఐ అక్కర్లేదని, తమ దర్యాప్తు సజావుగా సాగుతోందని సిట్ తెలంగాణ హైకోర్టుకి తెలిపింది. పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు రిపోర్ట్‌ ను హైకోర్టుకు సమర్పించింది. ఇదే సందర్భంలో సీబీఐ ఎంక్వయిరీ అక్కర్లేదని స్పష్టం చేసింది. సంచలన కేసుల్ని కూడా పరిష్కరించిన సామర్థ్యం తమకు ఉందని తెలిపింది.

స్టేటస్ రిపోర్ట్ లో కీలక అంశాలు..

హైకోర్టుకి సిట్ సమర్పించిన నివేదికలో పలు కీలక అంశాలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌ ని సిట్, కోర్టుకి సమర్పించింది. కొన్ని ఎన్ క్లోజర్స్‌ కూడా జతచేసింది. పేపర్‌ లీకేజీ కేసులో రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు. పేపర్‌ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. TSPSCలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్న శంకర లక్ష్మిని సాక్షిగా పరిగణించామన్నారు సిట్ అధికారులు. సాక్షులు, నిందితులు, TSPSC చైర్మన్‌, కమిషన్‌ మెంబర్లను సైతం ప్రశ్నించామన్నారు. వారి నుంచి సేకరించిన స్టేట్‌మెంట్స్‌ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు.

రాజకీయ నేతలనుంచి సమాచారం లేదు..

TSPSC పేపర్ లీకేజీ తర్వాత రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారందరికీ సిట్ నోటీసులిచ్చి సమాచారం రాబట్టాలని చూసింది. అయితే రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి కీలక సమాచారం లభించలేదని సిట్, హైకోర్టుకి తెలిపింది. పేపర్‌ లీకేజీ కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసింది. అందుకే ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదని పేర్కొంది.

First Published:  11 April 2023 4:19 PM GMT
Next Story