Telugu Global
Telangana

ఒక్కో కార్మికునికి రూ.6.5 లక్షలు.. త్వరలోనే చెల్లించనున్న సింగరేణి

సింగరేణి కార్మికులకు వేజ్‌బోర్డ్ బకాయిలు రూ.1,726 కోట్లు, లాభాల్లో వాటా రూ.700 కోట్లు, దీపావళి బోనస్ రూ.300 కోట్లు.. మొత్తం కలిపి రూ.2,800 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నారు.

ఒక్కో కార్మికునికి రూ.6.5 లక్షలు.. త్వరలోనే చెల్లించనున్న సింగరేణి
X

సింగరేణి కార్మికులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఒక్కో కార్మికుడు రూ.6.5 లక్షల మేర అందుకోనున్నట్లు తెలిపింది. వేజ్‌బోర్డ్ బకాయిలు, లాభాల్లో వాటా, దీపావళి బోనస్.. ఇలా మూడు విడతల్లో కార్మికులకు భారీగా చెల్లింపులు జరగనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

సింగరేణి కార్మికులకు వేజ్‌బోర్డ్ బకాయిలు రూ.1,726 కోట్లు, లాభాల్లో వాటా రూ.700 కోట్లు, దీపావళి బోనస్ రూ.300 కోట్లు.. మొత్తం కలిపి రూ.2,800 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నారు. దీని వల్ల ఒక్కో కార్మికుడు సగటున రూ.6.5 లక్షలు అందుకోనున్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ చెప్పారు. వచ్చే మార్చి నాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని శ్రీధర్ ఆదేశించారు.

సింగరేణి భవన్‌లో అన్ని ఏరియాల జీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో మెరుగైన బొగ్గు ఉత్పత్తి దిశగా సాగుతున్నదని శ్రీధర్ చెప్పారు. ప్రతీ ఏరియాకు నిర్థేశించిన లక్ష్యాలను రాబోయే ఏడు నెలల్లో సాధించాలని ఆయన చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందు వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నా.. కార్మికులు లక్ష్యం తగ్గకుండా పని చేస్తున్నందకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. వర్షాల వల్ల గనుల్లో నిలిచే నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సీఎండీ శ్రీధర్ సూచించారు.

First Published:  5 Sep 2023 12:02 AM GMT
Next Story