Telugu Global
Telangana

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ ఎందుకు వేయలేదో.. సీఎం కేసీఆర్‌కు రిపోర్టు ఇచ్చిన సింగరేణి!

వీఎస్పీ బిడ్ వేయడానికి అవసరమైన రూ.5,000 కోట్లు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సింగరేణి సంస్థకు వీలుపడదని నివేదికలో పేర్కొన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ ఎందుకు వేయలేదో.. సీఎం కేసీఆర్‌కు రిపోర్టు ఇచ్చిన సింగరేణి!
X

రాష్ట్రీయ్ ఇస్పాత్ నిగమ్ లిమిటెన్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. ఆ ప్లాంట్‌కు సంబంధించిన టెండర్లలో పాల్గొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థను బిడ్డింగ్‌లో పాల్గొనాలని, అంతకు ముందు వైజాగ్ వెళ్లి అధ్యయనం చేయాలని కూడా ఆదేశించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లో తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి పాల్గొనాలని కూడా భావించింది. అయితే వైజాగ్ వెళ్లి వచ్చిన తర్వాత బిడ్డింగ్‌లో పాల్గొన కూడదని నిర్ణయం తీసుకున్నది. అందుకు గల కారణాలను వివరిస్తూ ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించినట్లు తెలుస్తున్నది.

వైజాగ్ స్టీల్‌కు సంబంధించి ఈవోఐ సమర్పించడానికి గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. వీఎస్పీ బిడ్ వేయడానికి అవసరమైన రూ.5,000 కోట్లు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సంస్థకు వీలుపడదని నివేదికలో పేర్కొన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద దీన్ని సమీకరించడం, వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కూడా సమకూర్చుకోవడం ఇంత తక్కువ సమయంలో సింగరేణి సంస్థ చేయలేదని అధికారులు వివరించారు. ఒక వేళ బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి నిధులు సేకరించాలని అనుకున్నా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నారు.

సింగరేణి అధికారులు అందజేసిన నివేదికను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉన్నది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాత్రమే సీఎం కేసీఆర్ తమను వైజాగ్ పంపించారని.. వీలుంటేనే ఈవోఐ బిడ్‌లో పాల్గొనాలని సూచించినట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. సింగరేణి అధికారుల విన్నపం మేరకు బిడ్ ముగింపు తేదీని కూడా పెంచారు. అయినా సరే అనివార్య కారణాల వల్ల సింగరేణి సంస్థ బిడ్డింగ్ నుంచి తప్పుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో 29 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈవోఐను దాఖలు చేసినట్లు వీఎస్పీ అధికారులు తెలిపారు. మే మొదటి వారంలో ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

First Published:  21 April 2023 6:21 AM GMT
Next Story