Telugu Global
Telangana

కేసీఆర్ తరహాలోనే కేంద్రం కూడా రైతులకు రూ.10వేల పరిహారం ప్రకటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్

తడిసిన ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీలు పెడుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ తరహాలోనే కేంద్రం కూడా రైతులకు రూ.10వేల పరిహారం ప్రకటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్
X

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ అందించినట్లుగానే.. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.10వేలు సాయం ప్రకటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.10వేల పంట నష్టాన్ని ప్రధాని మోడీ చేత ప్రకటింప చేసిన తర్వాత.. బీజేపీ నాయకులు పంట పొలాల్లో అడుగుపెట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాల్లో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వులు, టమాటా, వరి పంటలను ఆయన పరిశీలించి.. బాధిత రైతులను ఓదార్చారు.

తడిసిన ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10వేలు సాయం చేసి రైతులకు అండగా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు రంగు మారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేనది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యాన్ని కొడకుండా అడ్డు పడేదీ వాళ్లే.. తిరిగి రైతులను రెచ్చగొట్టేది కూడా వారే అని బీజేపీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్.. పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడకూడదని ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు.

24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి పథకాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులతో దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని చెప్పారు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా రైతులు సంతోషంగా లేరని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

First Published:  7 May 2023 2:39 PM GMT
Next Story