Telugu Global
Telangana

సిద్దిపేట అంటే తెలంగాణకు జన్మనిచ్చిన నేల : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో ఎంతో అభివృద్ధి జరిగింది మంత్రి హరీశ్ రావు చాలా బాగా పని చేస్తున్నారు. నేను ఎప్పుడు సిద్దిపేట వచ్చినా.. ఏదో ఒక కొత్త నిర్మాణం జరుగుతూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు.

సిద్దిపేట అంటే తెలంగాణకు జన్మనిచ్చిన నేల : మంత్రి కేటీఆర్
X

సిద్దిపేట అంటే మీకు అమితమైన ప్రేమ ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. దానికి ఒక కారణం ఉంది. సిద్దిపేట అంటే తెలంగాణకు జన్మనిచ్చిన నేల.. తెలంగాణను తీసుకొని వచ్చిన సీఎం కేసీఆర్ సిద్దిపేట గడ్డపై పుట్టకపోయి ఉంటే.. మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదు. రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పనులు జరిగేవి కావు. మాకు పదవులు కూడా ఉండేవి కావని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో ఎంతో అభివృద్ధి జరిగింది మంత్రి హరీశ్ రావు చాలా బాగా పని చేస్తున్నారు. నేను ఎప్పుడు సిద్దిపేట వచ్చినా.. ఏదో ఒక కొత్త నిర్మాణం జరుగుతూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మొదటిగా కబేలా ప్రారంభానికి వెళ్లాను. ఆ తర్వాత మరికొన్నింటిని ప్రారంభించుకొని ఇక్కడ ఐటీ టవర్ దగ్గరకు వచ్చాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మంత్రి హరీశ్ రావు ఒక వైపు అత్యాధునిక కబేలాను నిర్మించి.. పర్యావరణానికి హాని కలుగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరోవైపు మన యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంలో ఐటీ టవర్ కూడా నిర్మింప చేసుకున్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నది.

ఈ రోజు మనం తెలంగాణ మాడల్ అని పిలుచుకుంటున్నాము. అది దేశానికే దిక్సూచిలా మారింది. కానీ ఇవన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభించిన పథకాలు కావు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు చేశారు. మిషన్ భగీరథ, హరితహారం వంటి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ఏనాడో సిద్దిపేటలో చేసి చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు ఎంతో మంది.. ఎన్నో విధాలుగా మాట్లాడారు. అసలు మీకు పరిపాలించుకోవడం వచ్చా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉంటే.. నేడు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇది కాదా తెలంగాణ సాధించిన విజయం అని కేటీఆర్ అన్నారు.

సిద్దిపేటలో స్వచ్చ బడి పేరుతో మంత్రి హరీశ్ రావు చేస్తున్న పనిని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే నెల నుంచే స్వచ్ఛ బడి కార్యక్రమం మొదలవుతుందని మంత్రి చెప్పారు.

కేసీఆర్ చేసిన దానికి కొనసాగింపే..

సిద్దిపేట పట్టణానికి తాను చేస్తున్నదంతా.. ఒకప్పుడు కేసీఆర్ చేసిన దానికి కొనసాగింపే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కోమటిబండి చెరువు అయినా, రింగ్ రోడ్డు అయినా కేసీఆర్ హయాంలోనే నిర్మించబడ్డాయి. వాటినే నేను మరింతగా అభివృద్ది చేశానని చెప్పారు. కేసీఆర్ పట్టుదల ఎలాంటిదో సిద్దిపేట ప్రజలకు బాగా తెలుసు. అలాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ ఉండటం చాలా గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్‌ను మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌‌ నుంచి పలు కంపెనీలు ఈ రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అంతకు ముందు ఇర్కోడ్ రోడ్డులో ఆధునిక కబేలా, ఇర్కోడ్ నాన్ వెజ్ పచ్చళ్లు, సేంద్రీయ ఎరువుల స్టాల్స్‌ను మంత్రులు ప్రారంభించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని బీసీ, సీసీ రోడ్లకు.. నర్సాపూర్ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.


First Published:  15 Jun 2023 9:10 AM GMT
Next Story