Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీకి షాక్.. పార్టీని వీడిన కీలక నేత

చంద్రశేఖర్ రాజీనామా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తోంది. సీనియర్ నేతల అలకను ఆయన ఎలా తీరుస్తారు.

తెలంగాణ బీజేపీకి షాక్.. పార్టీని వీడిన కీలక నేత
X

త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని వార్తలు జోరందుకుంటున్న తరుణంలో.. రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. కీలక పార్టీల్లో అలకల మీద ఉన్న నేతలు.. జంప్ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీలోని కీలక నేతలు కూడా ఇదే బాట పడుతుండటం.. ఆ పార్టీ నాయకత్వాన్ని టెన్షన్ పెడుతోంది.

తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన చంద్రశేఖర్.. పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసే వారికి ప్రోత్సాహం లేదంటూ ఓపెన్ గా కామెంట్ చేసేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించి.. పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన చర్చకు తెరతీశారు.




చంద్రశేఖర్ ను బుజ్జగించేందుకు స్వయంగా.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందరు ప్రయత్నించారు. ఇంటికి వెళ్లి మరీ నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. పార్టీ తీరుపై అలక మీదున్న చంద్రశేఖర్.. ఎంతమాత్రం ఈటల మాటలకు అంగీకారం చెప్పలేదు. బీజేపీని వీడే విషయంలో తన నిర్ణయానికే కట్టుబడ్డట్టు స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో మొదలైన చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన చరిత్ర ఉంది. తర్వాత టీఆర్ఎస్ లో చేరిన ఆయన.. అక్కడి నుంచి కాంగ్రెస్ కు వెళ్లారు. అటు తర్వాత బీజేపీకి మకాం మార్చారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం తీరుపై నిరసన స్వరం వినిపిస్తూ బయటికెళ్లిపోయారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రశేఖర్ రాజీనామా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తోంది. సీనియర్ నేతల అలకను ఆయన ఎలా తీరుస్తారు.. వారికి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి భరోసా కల్పిస్తారు.. పార్టీని మునుపటిలా మళ్లీ ఎలా గాడిలో పెడతారు.. పార్టీ అధిష్టానం కోరుకుంటున్నట్టుగా, అధికారం దిశగా ఎలాంటి ఎత్తులు వేస్తారు అన్నది.. ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే ఉంది.

First Published:  13 Aug 2023 4:22 AM GMT
Next Story