Telugu Global
Telangana

రేవంత్ పై షర్మిల సింపతీ.. నమ్మొచ్చా..?

సడన్ గా రేవంత్ రెడ్డి గెలుపుకోసం షర్మిల తనవంతు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంతకీ రేవంత్ గెలుపుకోసం షర్మిల ఏం చేశారు, ఏం చేస్తున్నారు..?

రేవంత్ పై షర్మిల సింపతీ.. నమ్మొచ్చా..?
X

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం కాకుండా అడ్డుకున్న వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు అనే అనుమానం షర్మిలలో ఉంది అని అంటారు ఆమె అనుచరులు. అందుకే రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఆమె విమర్శలతో విరుచుకుపడుతుంటారని చెబుతారు. ఆమధ్య సుప్రీంకోర్టు కూడా రేవంత్ ని దొంగ అన్నదని, ఓటుకు నోటు కేసుని తెరపైకి తెచ్చారు షర్మిల. అది కూడా కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతిస్తున్నాను అని షర్మిల చెప్పిన తర్వాతే కావడం గమనార్హం. అంటే కాంగ్రెస్ తో అవసరం ఉంది కానీ, రేవంత్ రెడ్డిని మాత్రం ఆమె లెక్కచేయరు అనే విషయం తేలిపోయింది. అయితే సడన్ గా రేవంత్ రెడ్డి గెలుపుకోసం షర్మిల తనవంతు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంతకీ రేవంత్ గెలుపుకోసం షర్మిల ఏం చేశారు, ఏం చేస్తున్నారు..?

వైఎస్సార్టీపీ తరపున వైఎస్ షర్మిల అధికారికంగా ఎవర్నీ పోటీలో దింపకపోయినా.. కొంతమంది నేతలు ఆమెను వ్యతిరేకించి ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా వైఎస్సార్టీపీ అధ్యక్షుడు నీలం సుధాకర్.. కామారెడ్డి బరిలో దిగేందుకు నామినేషన్ రెడీ చేశారు. తీరా ఆయన ఆర్వో కార్యాలయానికి వెళ్లాలనుకుంటున్న సమయంలో షర్మిల ఫోన్ చేసి వారించారట. ఆయన్ను లోటస్ పాండ్ కి పిలిపించి మాట్లాడారట. రేవంత్ పై పోటీ వద్దని షర్మిల తనకు చెప్పారని, అందుకే తాను అక్కడ నామినేషన్ వేయడంలేదని ప్రకటించారు నీలం సుధాకర్.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గట్టిపోటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ దశలో నీలం సుధాకర్ అక్కడ ఓట్లను చీల్చడం సరికాదనేది షర్మిల ఆలోచనగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గెలుపుకోసం కాకపోయినా, కేసీఆర్ మెజార్టీ పెరగకూడదనే పట్టుదలతోనే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేకుండా చేశారని అంటున్నారు. అందుకే సుధాకర్ ని పోటీ నుంచి తప్పించారంటున్నారు. కేవలం షర్మిల మాటతోనే సుధాకర్ పోటీనుంచి తప్పుకున్నారా..? ఒకవేళ సుధాకర్ పోటీ చేస్తే, ఆయనకు వచ్చే ఓట్లెన్ని, రేవంత్ రెడ్డికి జరిగే నష్టమెంత..? అనే విషయాలను పక్కనపెడితే రేవంత్ రెడ్డికి మద్దతుగా షర్మిల నిర్ణయం తీసుకున్నారనేదే ఇప్పుడు హైలైట్ గా మారింది.

First Published:  10 Nov 2023 2:55 AM GMT
Next Story