Telugu Global
Telangana

అది కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు.. షర్మిల షాకింగ్ కామెంట్స్

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించలేదని సర్టిఫికెట్ ఇచ్చారు షర్మిల. అది తెలియక చేసిన తప్పు అన్నారు. వారిలో పశ్చాత్తాపం ఉందని, అందుకే తన పార్టీని విలీనం చేస్తున్నానని ప్రకటించారు.

అది కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు.. షర్మిల షాకింగ్ కామెంట్స్
X

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహం వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న సందర్భంగా.. ఆమె ఆ పార్టీని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. గతంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందనే ఆరోపణలు ఉన్నా.. ఆ విషయంలో ప్రజలు సోనియా గాంధీని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు షర్మిల. వైఎస్సార్ విగ్రహం సాక్షిగా తాను అసలు విషయాలు చెబుతున్నానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక కూడా ఆయన పేరుని సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చారని తాను సోనియాను ప్రశ్నించానని అన్నారు. అయితే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు సీబీఐ చార్జ్ షీట్ లో చేర్చిన విషయాన్ని సోనియా తనకు గుర్తు చేశారని అన్నారు షర్మిల. వైఎస్సార్ పై తమకు అపార గౌరవం ఉందని సోనియా చెప్పారని, అలాంటి కుటుంబాన్ని తామెందుకు అవమానిస్తామన్నారని వివరించారు. ఆ విషయంలో కాంగ్రెస్ తెలియక తప్పు చేసిందన్నారు. వారిలో పశ్చాత్తాపం ఉందని, అందుకే తాను విలీనం చర్చలు జరిపానన్నారు షర్మిల.

నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా..

తెలంగాణలో తాను 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానన్నారు షర్మిల. తన యాత్ర ఒక యజ్ఞంలా సాగిందన్నారు. ప్రతి చోటా ప్రజలు తనకు సమస్యలు చెప్పుకున్నారని, హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే తాను కాంగ్రెస్ తో కలుస్తున్నానని అన్నారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని, తాను నిలబడుతూనే వైఎస్సార్టీపీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ తానే నిలబెడతానన్నారు షర్మిల. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. కొంతమంది తన పార్టీ లీడర్లే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. రాజకీయం అంటే వండినట్లు, తిన్నట్లు కాదని, ముందు చూపు, ఓపిక ఉండాలన్నారు.

పాలేరులో పోటీ..

వాస్తవానికి కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం కాకపోతే షర్మిల కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమెకు తుమ్మల నాగేశ్వరరావు రూపంలో పోటీ వచ్చింది. బీఆర్ఎస్ పై అలిగిన తుమ్మల కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నారు. పాలేరు టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశముంది. అంటే షర్మిలకు కూడా కాంగ్రెస్ నుంచే పాలేరు టికెట్ కావాలి. ఇప్పుడు తుమ్మలకోసం షర్మిల ఆ సీటు త్యాగం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా పాలేరు టికెట్ పై తాను త్వరలో స్పందిస్తానని చెప్పారు షర్మిల. తుమ్మల విషయంలో కాంగ్రెస్ ఓ క్లారిటీకి వస్తే, అప్పుడు షర్మిల పాలేరు గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద షర్మిల కాంగ్రెస్ ని బాగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ ని కాంగ్రెస్ అవమానించలేదని, అదంతా తెలియక జరిగిన తప్పు అని అంటున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడంలో తప్పేమీ లేదని సర్దిచెబుతున్నారు.

First Published:  2 Sep 2023 8:32 AM GMT
Next Story