Telugu Global
Telangana

హైదరాబాద్‌కు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. కంగ్రాట్స్ చెప్పిన మంత్రి కేటీఆర్

దేశంలోనే వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ హైదరాబాద్‌కు రావడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌కు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. కంగ్రాట్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. దేశంలో వ్యాక్సిన్ల తయారీలో అతి పెద్ద సంస్థగా ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) త్వరలోనే హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.


ఎస్ఐఐ సీఈవో డాక్టర్ సైరస్ పూనావాలా పేరుతో ఈ సెంటర్ నిర్వహించనున్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పలు పరిశోధనలు, సర్వేలను పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నిర్వహిస్తోంది. నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా నడుస్తున్న ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, గాంధీనగర్, భువనేశ్వర్, షిల్లాంగ్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్‌లోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేరుతో క్యాంపస్ నడిపిస్తున్నారు. ఇదే క్యాంపస్‌లో డాక్టర్ సైరస్ పూనావాలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్‌ఫెక్టిషియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపర్డ్‌నెస్ పేరుతో నిర్వహించనున్నారు.


ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కమ్యూనిటీ హెల్త్‌కు సంబంధించిన సమాచారం, వనరులు, ఇతర సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఈ సెంటర్ నుంచి హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కునే వీలుంటుంది. ఈ సెంటర్‌లో అత్యంత ఆధునిక టెక్నాలజీ, రీసోర్సెస్ అందుబాటులో ఉండనున్నాయి.

దేశంలోనే వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ హైదరాబాద్‌కు రావడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. దేశంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయిన హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో సీరమ్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలాను దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కలుసుకున్నట్లు తెలిపారు.

అతి కొద్ది సమయంలోనే సీరమ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సెంటర్ ప్రజారోగ్యానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేసి, ఒక అద్బుతమైన ప్రగతి వైపు ముందడుగు వేస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వ్యాక్సిన్లకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన కేటీఆర్ పేర్కొన్నారు.

First Published:  19 Feb 2023 7:55 AM GMT
Next Story