Telugu Global
Telangana

హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఉదయం రియల్టర్, రాత్రి లాయర్..

ఇస్మాయిల్ అనే రియల్టర్ ని కొంతమంది దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. రాత్రి ములుగు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై అడ్వొకేట్ మల్లారెడ్డి ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు.

హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఉదయం రియల్టర్, రాత్రి లాయర్..
X

ఉదయం ఓ రియల్టర్ దారుణ హత్య, రాత్రికి ఓ లాయర్ కారులోనే హతం.. ఇలా గంటల వ్యవధిలోనే హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన రెండు మర్డర్లు కలకలం రేపాయి. మాదాపూర్ లో సోమవారం తెల్లవారు జామున మూడున్నర గంటలకు ఇస్మాయిల్ అనే రియల్టర్ ని కొంతమంది దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. రాత్రి ములుగు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై అడ్వొకేట్ మల్లారెడ్డి ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ప్రతీకార దాడులు ఇటీవల కాలంలో దాదాపుగా తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. కానీ తాజాగా నడిరోడ్డుపై హత్యలు జరగడం మాత్రం సంచలనంగా మారింది. ప్రత్యర్థి దొరుకుతాడని తెలిస్తే చాలు, అది రోడ్డా, నిర్మానుష్య ప్రాంతమా, సీసీ కెమెరాలున్నాయా, ఎవరికైనా దొరికే అవకాశముందా అనే ఆలోచనే లేకుండా హంతక ముఠాలు తమ ప్లాన్ అమలు చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన గొడవల కారణంగా మాదాపూర్ మర్డర్ జరిగింది. గతంలో స్నేహితులే ఆ తర్వాత ప్రత్యర్థులయ్యారు. సెటిల్మెంట్ కి పిలిచి మరీ ఇస్మాయిల్ అనే వ్యక్తిని కాల్చి చంపారు, ఈ ఘటనలో గాయపడిన జహంగీర్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 5 పోలీస్ టీమ్ లు హంతకులకోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి.

సోమవారం రాత్రి లాయర్ మల్లారెడ్డిని ప్రత్యర్థులు ములుగు-హైదరాబాద్ రహదారిపై పందికుంట వద్ద హతమార్చారు. సినీ ఫక్కీలో కారుని చేజ్ చేశారు. కారు రోడ్డుకి అడ్డంగా ఆపి.. కత్తులతో దాడి చేశారు. డ్రైవర్ ని చితకబాదారు. ఆ తర్వాత మల్లారెడ్డిపై దాడి చేసి విచక్షణా రహితంగా గాయపరిచారు. రక్తపు మడుగులో లాయర్ కారులోనే హతమయ్యాడు. గతేడాది పెద్దపల్లి జిల్లాలో లాయర్ వామనరావు దంపతుల దారుణ హత్య కూడా ఇలాగే జరిగింది. లాయర్ దంపతులు కారులోనే రక్తపు మడుగులో చనిపోయారు. తాజాగా జరిగిన లాయర్ మల్లారెడ్డి హత్య కూడా ఆ ఘటనను గుర్తు తెస్తోంది. మైనింగ్ వ్యాపారంలో ఉన్న గొడవలే ఈ హత్యకు కారణం అని తెలుస్తోంది. హంతకులకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకేరోజు గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు హత్యలు హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపాయి.

First Published:  2 Aug 2022 2:12 AM GMT
Next Story