Telugu Global
Telangana

కేబినెట్ భేటీతోపాటు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా..

కేబినెట్ మీటింగ్ తర్వాత సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ని తెలంగాణ భవన్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కేబినెట్ భేటీతోపాటు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా..
X

సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ జరిగే కేబినెట్ మీటింగ్ పై అందరికీ ఆసక్తి నెల‌కొంది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే కీలక ప్రకటన ఈ మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వెలువ‌డుతుంద‌నే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ తర్వాత టీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుందని సమాచారం ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలకు కూడా టీఆర్ఎస్ఎల్పీకి రావాల్సందిగా కబురందింది. కేబినెట్ మీటింగ్ తర్వాత సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ని తెలంగాణ భవన్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. కీలక నిర్ణయాలను నాయకులందరికీ చేరవేసేందుకే లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుంటారు. మరి ఈ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నారనేది సస్పెన్స్.

ఇటీవల జాతీయ రైతు సంఘాల‌ నాయకులు తెలంగాణలో పర్యటించారు. వారంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రైతుల సమస్యల పరిష్కారానికి న్యాయపోరాటంతోపాటు, పార్లమెంట్ లో కూడా పోరాడాలని వారికి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. రైతు నాయకులు చట్టసభల్లో అడుగుపెట్టాలని, రాజకీయాలను నామోషీగా భావించొద్దని చెప్పారు. కేసీఆర్ పిలుపు మేరకు రైతు నాయకులు పార్లమెంటరీ పోరాటానికి సై అన్నారు. ఆ భారమంతా తిరిగి కేసీఆర్ పైనే పెట్టారు, ఆయన మార్గ‌నిర్దేశంలో నడుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఓవైపు మునుగోడు ఎన్నిక, మరోవైపు మతకల్లోలాలు సృష్టించేలా బీజేపీ నాయకుల చర్యలు, ఇంకోవైపు టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేలా బీజేపీ అధిష్టానం కుయుక్తులు.. వీటన్నింటి మధ్య ఇప్పుడు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెడుతున్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఒకే వేదికనుంచి దిశానిర్దేశం చేయబోతున్నారు.

First Published:  30 Aug 2022 7:34 AM GMT
Next Story