Telugu Global
Telangana

సెప్టెంబర్ 17.. ఒకరిది విమోచనం, మరొకరిది విలీనం.. తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారు?

కానీ నిజాం నవాబు ఏనాడూ దేశం విడిచి పారిపోవాలని భావించలేదు. పైగా తన ఆస్తులను మొత్తం దేశానికి అప్పగించేశారు. ఇవ్వాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్న ఎన్నో భవనాలు నిజాములు హయాంలో నిర్మించినవే. పైగా ఇదే వల్లభాయ్ పటేల్.. నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు పెన్షన్ ఇచ్చి.. గవర్నర్‌కు సమానమైన రాజ్ ప్రముఖ్ హోదాను కట్టబెట్టారు. సర్థార్ వల్లభాయ్ పటేల్‌ను ఆకాశమంత ఎత్తుకు (అంత పెద్ద విగ్రహం) పొగిడే బీజేపీ.. అదే పటేల్ గౌరవించిన నిజాంను మాత్రం రాక్షసుడిగా చిత్రీకరిస్తోంది. కానీ ఆయనకు పెద్ద హోదా కట్టబెట్టింది ఇదే బీజేపీ మోస్తున్న పటేలే కదా. అందుకే బీజేపీ చేస్తున్న రాజకీయాలను చాలా మంది ఎండగడుతున్నారు.

సెప్టెంబర్ 17.. ఒకరిది విమోచనం, మరొకరిది విలీనం.. తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారు?
X

సెప్టెంబర్ 17.. ఈ డేట్ ఎప్పుడు వచ్చినా తెలంగాణలో ఓ ఉద్వేగభరితమైన సన్నివేశం నెలకొంటుంది. ఒకరేమో విలీన దినమని.. మరొకరు విమోచన అనే పేరుతో ప్రచారం చేసుకుంటారు. గత ఎనిమిదేళ్లలో 'సెప్టెంబర్ 17' తెలంగాణ రాష్ట్రంలో చాలా వివాదంగా మారింది. రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఏమైనా ప్రచారం చేస్తాయి. కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి? అసలు ఈ రోజు కేవలం తెలంగాణకే పరిమితమా? రాష్ట్రంలో కలవకుండా పోయిన మిగిలిన హైదరాబాద్ స్టేట్‌లో ప్రజల మనోభావాలు ఏమిటనేవి ఎవరికీ పట్టవు. అసలు ఈ రోజును తెలంగాణ ప్రజలు విమోచనా దినంగా ఎందుకు పరిగణించాలనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అయినా, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా.. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ ప్రజలు అసలు ఏమని భావిస్తున్నారో అనే సోయి లేకుండా ఉద్వేగాలను రెచ్చగొట్టడం పరిపాటి అయ్యింది. ముఖ్యంగా బీజేపీ పన్నిన ఈ ఉచ్చులో టీఆర్ఎస్ పడిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్నో సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో కలుస్తామని ప్రకటించాయి. అలా కాకుండా స్వతంత్ర దేశంగా ఉండిపోతామని చెప్పిన రాజ్యాల్లో కశ్మీర్, జునాగఢ్‌తో పాటు హైదరాబాద్ స్టేట్ ఒకటి. 1947 అగస్టు 15న స్వతంత్రం వచ్చినా.. తెలంగాణ ప్రాంతంలో (హైదరాబాద్ స్టేట్)లో సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చిందని భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం ఏడాది తర్వాత కానీ దేశంలో విలీనం కాలేదు. ఆనాడు వల్లభాయ్ పటేల్ దేశంలోని అనేక సంస్థానాలను చర్చల ద్వారా ఐక్యం చేశారు. అందుకే ఆయన కోసం బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌లో 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' అంటే ఐక్యతకు ప్రతీకగా భారీ విగ్రహాన్ని నెలకొల్పింది. ఆయన దేశంలో అన్ని రాజ్యాలను కలిపితే అది ఐక్యత అయినప్పుడు మరి.. దేశంలో తెలంగాణ కలసిన రోజు విమోచన ఎలా అవుతుందనే ప్రశ్న ఉత్పన్న అవుతోంది.

హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంగా.. కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్నాటకలో కలిసిపోయాయి. భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏపీలో విలీనం అయిన హైదరాబాద్ స్టేట్‌ను తెలంగాణ ప్రాంతంగా పిలిచినట్లే.. కర్నాటకలో విలీనం అయిన ప్రాంతాన్ని కళ్యాణ కర్నాటక అని ఇప్పటికీ పిలుస్తున్నారు. కళ్యాణ కర్నాటక ప్రాంతంలో సెప్టెంబర్ 17ను మామూలుగా జరుపుతున్నారు. అది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త హడావిడి ఎక్కవైంది. అయితే ఉమ్మడి ఏపీలోగానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ సెప్టెంబర్ 17ను ఏనాడూ ఒక ప్రత్యేక రోజుగా పరిగణించలేదు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఇది విలీనమా? విమోచనమా? అని కూడా ఆలోచించలేదు. కారణం.. తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం.. ఆ తర్వాత 1969లో తొలి దశ తెలంగాణ పోరాటం.. ఆ తర్వాత విప్లవోద్యమాలతోనే కాలం గడిచిపోయింది.

ప్రత్యేక ప్రాంతం కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాడిన ఈ నేల.. 2014లో ఆ కలను నెరవేర్చుకున్నది. అంతే కానీ ఏనాడూ సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో కలిశామనే సంబరాలు చేసుకోలేదు. అయితే, బీజేపీ తమ రాజకీయ అవసరాల కోసం ఈ తేదీని రాజకీయం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఏనాడూ.. ఈ రోజు గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ, బీజేపీ పదే పదే సెప్టెంబర్ 17 విమోచన దినం అని ప్రచారం చేస్తుండటంతో ఇక టీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగక తప్పలేదు. తెలంగాణ ప్రజలు జూన్ 2కు ఇచ్చే ప్రాధాన్యత సెప్టెంబర్ 17కు ఇవ్వరు అన్నది అక్షర సత్యం. కానీ ఈ సారి ఈ రోజు కోసం తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి.

సెప్టెంబర్ 17ను బీజేపీ విమోచన దినంగా, నిజాం నవాబుల రాక్షస పాలన నుంచి విడిపించిన రోజుగా ప్రచారం చేస్తోంది. ఆనాడు సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగానే హైదరాబాద్ స్టేట్ దేశంలో కలిసిందని.. లేకపోతే మరో పాకిస్తాన్ అయ్యేదనే విధంగా ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ నిజాం నవాబు ఏనాడూ దేశం విడిచి పారిపోవాలని భావించలేదు. పైగా తన ఆస్తులను మొత్తం దేశానికి అప్పగించేశారు. ఇవ్వాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్న ఎన్నో భవనాలు నిజాములు హయాంలో నిర్మించినవే. పైగా ఇదే వల్లభాయ్ పటేల్.. నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు పెన్షన్ ఇచ్చి.. గవర్నర్‌కు సమానమైన రాజ్ ప్రముఖ్ హోదాను కట్టబెట్టారు. సర్థార్ వల్లభాయ్ పటేల్‌ను ఆకాశమంత ఎత్తుకు (అంత పెద్ద విగ్రహం) పొగిడే బీజేపీ.. అదే పటేల్ గౌరవించిన నిజాంను మాత్రం రాక్షసుడిగా చిత్రీకరిస్తోంది. తెలంగాణ ప్రజలకు నిజాం రాక్షసుడే అవ్వొచ్చు. కానీ ఆయనకు పెద్ద హోదా కట్టబెట్టింది ఇదే బీజేపీ మోస్తున్న పటేలే కదా. అందుకే బీజేపీ చేస్తున్న రాజకీయాలను చాలా మంది ఎండగడుతున్నారు.

ఒకవైపు సమైక్యతకు గుర్తుగా పటేల్‌ను అభివర్ణించే బీజేపీ.. సెప్టెంబర్ 17న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించాలని డిసైడ్ అయ్యింది. కానీ ఆ రోజు చేసే వేడుకు మాత్రం విమోచనం (విముక్త్) అని పేరు పెట్టింది. హైదరాబాద్‌లో జరుగనున్న ఆ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ సభలో పాల్గొననున్నారు. పారామిలటరీ బలగాలతో ఆ రోజు భారీ కవాతును కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం దాదాపు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ కార్యక్రమమే. అందులో హోం మంత్రి పాల్గొననుండటంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పటేల్ వారసులం అని ప్రకటించకుంటున్న బీజేపీ.. విముక్త్ పేరుతో రెండు నాలుకల ధోరణి అవలంభించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఇక తెలంగాణ విషయంలో ఎవరు ఎలాంటి అసంబద్ద ప్రకటనలు చేసినా ఖండించడానికి ముందుండే సీఎం కేసీఆర్.. సెప్టెంబర్ 17 విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం విభేదిస్తుండం వల్లే సెప్టెంబర్ 17ను రచ్చ చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని ఇలా మళ్లించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే బీజేపీ విమోచన దినానికి ధీటుగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించడానికి నడుం భిగించారు. గత ఎనిమిదేళ్లలో ఏనాడూ సెప్టెంబర్ 17ను పెద్దగా గుర్తు చేసుకోని కేసీఆర్.. కేవలం బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాకు కౌంటర్‌గానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కేసీఆర్ చేస్తున్నది కౌంటర్‌గానే అయినా.. తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని అంటున్నారు.

కేసీఆర్ చేసేది విభజన రాజకీయాలు కాదని.. తెలంగాణ ప్రజలను విమోచన దినం పేరుతో విభజించాలని చూస్తున్న బీజేపీ కౌంటర్ కార్యక్రమమే అని అంటున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 17కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఆ రోజు ఉదయం పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత బంజారా భవన్, ఆదివాసీ భవన్‌ను ప్రారంభిస్తారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనున్నది. ఇక సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా సభ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం జరుగనుండగా.. సాయంత్రం సీఎం కేసీఆర్ సభ జరుగనున్నది. దీంతో ఆ రోజు అమిత్ షా చేసే ఆరోపణలు, విమర్శలు అన్నింటికీ సాయంత్రమే కేసీఆర్ సమాధానం ఇస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సెప్టెంబర్ 17 బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హీట్‌ను పెంచిందనేది వాస్తవమే.

First Published:  14 Sep 2022 8:25 AM GMT
Next Story