Telugu Global
Telangana

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక గాంధీ.?

దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ప్రియాంకా గాంధీకి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ముందుగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంకను నియమించాలని అనుకుంటోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక గాంధీ.?
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అధిష్టానం సీరియస్‌గా ఉందా? ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ సీనియర్ నేతల వలసలను అడ్డుకోలేక పోయినందుకు గుర్రుగా ఉందా? గ్రూపు తగాదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారని కోపంగా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడుతోంది. ఏపీ సంగతి పక్కన పెడితే.. తెలంగాణలో తగినంత బలం, నాయకులు ఉన్నా.. గెలవడం మాత్రం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కీలకమైన వ్యక్తికి దక్షిణాది బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ప్రియాంకా గాంధీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంకను నియమించాలని అనుకుంటోంది. తెలంగాణ ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ పూర్తిగా విఫలమయ్యారని అధిష్టానం గుర్రుగా ఉంది. అందుకే చరిష్మా ఉన్న ప్రియాంక గాంధీ నియామకం కలసి వస్తుందని భావిస్తోంది. మునుగోడు ఎన్నిక‌ల‌ కంటే ముందే ప్రియాంకకు ఆ బాధ్యతలు ఇవ్వొచ్చని సమాచారం. కర్నాటకలో కూడా సిద్దిరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రియాంక రాకతో అవి సమసిపోతాయని అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని.. ఆ తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడంలో రేవంత్ రెడ్డి సఫలం అయ్యారు. కానీ అదే సమయంలో ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న సీనియర్లు.. రేవంత్ వెనుక నడవటానికి సిద్దంగా లేరు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పదే పదే ఇవే ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో నాయకులందరూ ఏకతాటిపై ఉన్నట్లే కనిపించారు. కానీ మళ్లీ గ్రూపు తగాదాలు తెరపైకి వచ్చాయి. ఇతరుల సంగతి ఎలా ఉన్నా.. సీనియర్లు మాత్రం పదే పదే టీపీసీసీ చీఫ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి సర్దిచెప్పడంలో మాణిక్యం ఠాకూర్ విఫలమయ్యారని అధిష్టానం అనుకుంటోంది.

ప్రియాంక గాంధీ గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించారు. ఆమె రాకవల్ల అక్కడి కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే దక్షిణాదిన మాత్రం ప్రియాంక చరిష్మా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అనుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు అలాంటి నాయకురాలు ఉంటే.. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుంది. ప్రియాకం కనుక రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తే.. అది తప్పకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  13 Aug 2022 11:52 AM GMT
Next Story