Telugu Global
Telangana

మునుగోడులో ఓటమిపై బీజేపీ జాతీయ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఓటమి బీజేపీకి ఎదురు దెబ్బ అని ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఇతర నేతలకు భిన్నంగా ఉన్న ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తి రేకిత్తిస్తున్నవి.

మునుగోడులో ఓటమిపై బీజేపీ జాతీయ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
X

హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ విజయం సాధించి బీజేపీ ఓడి పోవడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని హుందాగా ఒప్పుకోకపోగా కేంద్రం చేతుల్లోనే ఉన్న ఎన్నికల కమిషన్ పై , మునుగోడులో గెలిచిన టీఅరెస్ పై చిందులు తొక్కుతున్నారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్షణ్ లు... టీఆరెస్ అక్రమంగా గెలిచిందని, నైతికంగా తామే గెలిచామంటూ వాదనలు చేస్తున్నారు. వీరి వాదనలను , ఆక్రోశాన్ని సోషల్ మీడియాలో నెటిజనులు హేళన చేస్తుండగా బీజేపీకి చెందిన ఒక నాయకుడిని మాత్రం నెటిజనులు మెచ్చుకుంటున్నారు.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ. మురళిధర్ రావు...

''సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమిపాలవడం బీజేపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ. అటువంటి ఫలితం ఎందుకొచ్చింది అనే దానిపై పార్టీ పరిశీలన చేస్తుంది, అయితే ఇది తెలంగాణలో బిజెపి ఎదుగుదలను ఆపదు.'' అని ట్వీట్ చేశారాయన.

మిగతా బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం, ఈ ఓటమి పార్టీకి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించడం పట్ల నెటిజనులు ఆశ్చ‌ర్యపోయారు.

బలవంతంగా ఎన్నిక తీసుకవచ్చి బొక్కబోర్లా పడ్డ బీజేపీ, తన స్వార్దం కోస‍ం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎన్నికలకు కారణమై, ఉన్న సీటు పోగొట్టుకున్న రాజగోపాల్ రెడ్డిపై నెటిజనులు విరుచుకపడుతున్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి గెలుద్దామనుకున్న రాజ్ గోపాల్ రెడ్డి ప్రయత్నాన్ని జనం తిప్పికొట్టడంతో ఆయన , ఇతర బీజేపీ నాయకులు చూపిస్తున్న అసహనం, వెల్లడిస్తున్న ఆక్రోశం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకు నిజంగా చెంపదెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే మరో రకమైన అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నవి. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులు పార్టీలు మారి బీజేపీలో చేరితే తప్ప తెలంగాణలో డిపాజిట్ దక్కించుకునే పరిస్థితి లేని బీజేపీకి ఈ ఓటమి ఎదురు దెబ్బ ఎలా అవుతుందని మరి కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అయితే గియితే ఇది కోమటి రెడ్డికి ఎదురు దెబ్బ అని, బీజేపీ తెలంగాణలో తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటోందని విమర్శలు చేస్తున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు లేని, నిర్మాణం లేని, కనీస ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనుకోవడం అత్యాశే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. వేరే పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బీజేపీలో చేరి పోటీ చేయకపోతే ప్రతి చోటా నాగార్జున సాగర్ లాంటి ఫలితాలు వస్తాయన్న వాదనలు చేస్తున్నారు నెటిజనులు.

First Published:  7 Nov 2022 3:24 AM GMT
Next Story