Telugu Global
Telangana

బీజేపీలో సీనియర్లు సైలెంట్‌.. దరఖాస్తులు నామమాత్రమేనా..?

గజ్వేల్‌, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్‌, ఆయన సతీమణి ఈటల జమున తరఫున దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే ఇదే విషయాన్ని అడిగితే ఈటల ఆఫీసు మాత్రం మాకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.

బీజేపీలో సీనియర్లు సైలెంట్‌.. దరఖాస్తులు నామమాత్రమేనా..?
X

బీజేపీలో అసెంబ్లీకి పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దాదాపు 6,003 దరఖాస్తులు వచ్చాయి. అయితే సీనియర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి మినహా మిగితావాళ్లేవరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం దరఖాస్తు చేయలేదు. సిట్టింగ్ ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని.. దీంతో ఎంపీలంతా అసెంబ్లీ బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఏ ఒక్కరి నుంచి దరఖాస్తులు అందలేదు.

అంబర్‌పేట నుంచి కిషన్‌ రెడ్డి, గద్వాల్‌ నుంచి డి.కే.అరుణ, నిజామాబాద్‌ రూరల్‌ లేదా ఆర్మూర్‌ నుంచి ధర్మపురి అర్వింద్, వేములవాడ లేదా కరీంనగర్ నుంచి బండి సంజయ్‌, బోథ్‌ నుంచి సోయం బాపురావు, చెన్నూర్‌ లేదా ధర్మపురి నుంచి వివేక్ వెంకటస్వామి, ఉప్పల్‌ నుంచి NVSS ప్రభాకర్‌, ఖైరతాబాద్‌ నుంచి చింతల రామచంద్రారెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ లిస్టులో ఉన్న ముఖ్య నేతల్లో ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు.

గజ్వేల్‌, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్‌, ఆయన సతీమణి ఈటల జమున తరఫున దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే ఇదే విషయాన్ని అడిగితే ఈటల ఆఫీసు మాత్రం మాకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌, ఈటల జమున తరపున కొందరు కార్యకర్తలు, అభిమానులు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకోకపోవడం.. పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తులు కేవలం నామమాత్రంగానే స్వీకరించారని.. అదే ఫైనల్ కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  11 Sep 2023 5:04 PM GMT
Next Story