Telugu Global
Telangana

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన.. కేసీఆర్ ఆప్త మిత్రుడు

అలాంటి పార్టీలో తాను ఉండలేనని, కేసీఆర్ నియంతృత్వాన్ని భరించి చివరకు అలసి పోయానని రాజయ్య చెప్పుకొచ్చారు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాజయ్య పలు విషయాలు వెల్లడించారు.

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన.. కేసీఆర్ ఆప్త మిత్రుడు
X

టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్న సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. 22 ఏళ్ల నుంచి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీతో ఉన్న రాజయ్య యాదవ్.. తెలంగాణ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా, 2014లో గజ్వేల్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ అరెస్టై ఖమ్మం జిల్లా జైలులో ఉన్నారు. అప్పుడు కేసీఆర్‌తో పాటు ఉన్న ఆరుగురిలో రాజయ్య కూడా ఒకరు. పార్టీలో రెండు దశాబ్దాలకు పైగా నమ్మకంగా పని చేసినా ఆత్మగౌరవం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలో తాను ఉండలేనని, కేసీఆర్ నియంతృత్వాన్ని భరించి చివరకు అలసి పోయానని రాజయ్య చెప్పుకొచ్చారు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాజయ్య పలు విషయాలు వెల్లడించారు.

టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని ఆవేదన చెందారు. పార్టీలో ఇప్పటికీ ఉంటున్న ఉద్యమకారులు ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. ఉద్యమకారుడినైన తనకు జరిగిన అన్యాయమే మీ విషయంలోనూ జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గతంలో తనకు చైర్మన్ పదవి ఇచ్చినా.. నేను సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయలేకపోయానని.. అధికారాలన్నీ మంత్రి చేతిలో పెట్టడమే కారణమని ఆయన ఆరోపించారు.

తొలి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తనను అవమానించారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో మంత్రి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడినా.. తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచే పార్టీలో, ప్రభుత్వంలో తనకు అవమానాలు ప్రారంభమయ్యాయని రాజయ్య అన్నారు. 2009లో మెదక్ లోక్‌సభ టికెట్ తనకే ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చి.. ఆ తర్వాత విజయశాంతికి టికెట్ కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ ఎందుకు నేరుగా రాజ్యసభకు పంపుతానని తర్వాత హామీ ఇచ్చి.. బడుగుల లింగయ్య యాదవ్‌ను పంపి త‌న‌ను మోసం చేశారని చెప్పారు.

ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న వారికి పదవులు కట్టబెట్టి, ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పార్టీలో అందరూ తనను అన్నా అని పిలిచినోళ్లే అని.. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఒక్కరు కూడా ఫోన్ తీయడం లేదని అన్నారు. తానెప్పుడూ తలదించుకునే పని చేయలేదని.. అవమానాలు చేస్తుంటే భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు వివరించారు.

టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇవాళ బాగానే ఉండవచ్చు.. కానీ గతంలో ఇలా వెలుగు వెలిగిన పార్టీలు చివరకు కనుమరుగైన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఉద్యమకారుల ఆవేదన అర్థం కాదన్నారు. తాను ప్రస్తుతానికి భవిష్యత్ గురించి ఆలోచించలేదని.. కొంచెం విశ్రాంతి తీసుకున్న అనంతరం చెప్తానని రాజయ్య వెల్లడించారు.

First Published:  30 July 2022 9:04 AM GMT
Next Story