Telugu Global
Telangana

'వర్కింగ్ యాజ్ హోం గార్డ్ ఆఫ్ కాంగ్రెస్'.. ట్విట్టర్ బయో మార్చిన వీహెచ్

హోంగార్డు వ్యాఖ్యల వేడి తగ్గిపోతుందని అనుకుంటున్న సమయంలో తాజాగా వీహెచ్ తన బయోలో హోంగార్డు అని రాసుకోవడం సంచలనంగా మారింది.

వర్కింగ్ యాజ్ హోం గార్డ్ ఆఫ్ కాంగ్రెస్.. ట్విట్టర్ బయో మార్చిన వీహెచ్
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిత్యం మీడియాలో నానుతూ ఉండే వి. హనుమంతరావు మరో సారి వార్తల్లో చర్చనీయాంశం అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్‌ బయోలో 'కరెంట్లీ వర్కింగ్ యాజ్ హోమ్ గార్డ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ' అని మార్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఎంపీగా పని చేసిన వీహెచ్.. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడాన్ని వ్యతిరేకించిన సీనియర్లలో వీహెచ్ ఒకరు.

రేవంత్ రెడ్డి గతంలో చేసిన 'హోంగార్డ్' అనే వ్యాఖ్య సీనియర్లను చాలా ఇబ్బంది పెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 34 ఏళ్లు పని చేసిన హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్ కూడా కాలేడు. సివిల్స్ పరీక్ష రాసి జిల్లా ఎస్పీ అయిన వాళ్లను పట్టుకొని.. నేను ఇన్నేళ్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. నువ్వు ఎస్పీ ఎట్లా అవుతావు అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అని రేవంత్ గతంలో విమర్శించారు. తనను తాను సివిల్స్ రాసి వచ్చిన ఎస్పీగా.. మిగిలిన కాంగ్రెస్ సీనియర్లను హోం గార్డుగా పోల్చారు.

ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హర్ట్ అయ్యారు. తమను హోం గార్డులతో పోలుస్తారా అని మండిపడ్డారు. ఇటీవల రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క హోం గార్డు రాజీనామా చేస్తే వచ్చే నష్టమేమీ లేదంటూ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి కూడా తాను పీసీసీ ప్రెసిడెంట్ అవడం కాంగ్రెస్ పార్టీలోని నలుగురైదుగురికి తప్ప అందరికీ ఇష్టమే అని వ్యాఖ్యానించారు.

ఈ హోంగార్డు వ్యాఖ్యల వేడి తగ్గిపోతుందని అనుకుంటున్న సమయంలో తాజాగా వీహెచ్ తన బయోలో హోంగార్డు అని రాసుకోవడం సంచలనంగా మారింది. తన బయోలో మాజీ రాజ్యసభ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనేవి అలాగే ఉంచి.. చివర్లో మాత్రం 'ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హోం గార్డుగా పని చేస్తున్నాను' అని రాసుకున్నారు.





First Published:  27 Nov 2022 9:01 AM GMT
Next Story