Telugu Global
Telangana

బండి సంజ‌య్ తీరుపై సీనియ‌ర్ల కినుక‌!

అందరినీ కలుపుకుపోకుండా సొంత మైలేజ్ కోసం ఆరాటపడుతున్నాడని.. సీఎం కుర్చీ కోసం ఇదంతా చేస్తున్నాడన్న విమర్శలున్నాయి.

బండి సంజ‌య్ తీరుపై సీనియ‌ర్ల కినుక‌!
X

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు రాష్ట్రంలోని ఆ పార్టీ సీనియ‌ర్ల‌కు రుచించ‌డం లేదట‌. ఆయ‌న చేప‌ట్టిన‌ పాదయాత్రకు తెలంగాణలోని బీజేపీ సీనియర్ల మద్దతు లేదన్నది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇది ఇష్టం లేదని.. తాను సొంతంగా ఎదిగేందుకు ఈ పాదయాత్రను చేపట్టాడని వాళ్లు భావిస్తున్నారు. అందరినీ కలుపుకుపోకుండా సొంత మైలేజ్ కోసం ఆరాటపడుతున్నాడని.. సీఎం కుర్చీ కోసం ఇదంతా చేస్తున్నాడన్న విమర్శలున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో బీజేపీలోని గ్రూపులు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని తెలుస్తోంది. బ‌ల‌మైన కిష‌న్‌రెడ్డి వ‌ర్గం కూడా పాద‌యాత్ర‌లో పాలుపంచుకోలేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బండితో పాటు పెద్ద నేత‌లు ఎవ‌రూ ఈ పాద‌యాత్ర‌లో పాలుపంచుకోక‌పోవ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నాయి. కొంద‌రు నేత‌లైతే అస‌లు ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం.

మ‌రోప‌క్క ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న బండి సంజ‌య్ సొంత పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం. ఇటీవ‌ల ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజున స‌మావేశం నిర్వ‌హించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీకి ఊపు తెచ్చిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను కూడా బండి సంజ‌య్ విస్మరించారని పార్టీ వ‌ర్గాల్లో టాక్‌. వారి పేర్లు మొద‌ట ప‌ల‌క‌కుండా ఎమ్మెల్యేలు కానివారి పేర్లు చెప్పి ఆఖ‌రున వారి పేర్లు ప్ర‌స్తావించ‌డం వారిని తీవ్ర అవ‌మానానికి గురిచేసింద‌ని చెబుతున్నారు. ఇప్ప‌డు బీజేపీలో ఈ విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఈటల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు వంటి వారి విష‌యంలో బండి సంజ‌య్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై బీజేపీవాదులు పెద‌వి విరుస్తున్నారు. కావాల‌నే త‌న కంటే సీనియ‌ర్ల‌ను తొక్కేసే ప‌ద్ధ‌తిలో ముందుకెళ్తున్నాడ‌ని, పార్టీలో తానే హీరో అనిపించుకోవాల‌నే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అంటున్నారు. ఇదే తీరు కొన‌సాగితే రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి ఓట‌మి ఖాయ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

First Published:  30 Aug 2022 7:31 AM GMT
Next Story