Telugu Global
Telangana

సీడబ్ల్యూసీలో సీతక్క, సంపత్ కుమార్‌లకు చోటు? పైరవీ చేస్తున్న రేవంత్ రెడ్డి!

సీడబ్ల్యూసీలో 10 ఏళ్ల క్రితం తెలంగాణ నుంచి కే. కేశవరావు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు.

సీడబ్ల్యూసీలో సీతక్క, సంపత్ కుమార్‌లకు చోటు? పైరవీ చేస్తున్న రేవంత్ రెడ్డి!
X

కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీని తిరిగి ప్రారంభించే పనుల్లో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఉన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని రద్దు చేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్‌పూర్‌లో జరిగిన ప్లీనరీలో సీడబ్ల్యూసీ పునరుద్దరణకు నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎవరిని సభ్యులుగా నియమించాలనే అంశం పూర్తిగా జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకే అప్పగించారు.

సీడబ్ల్యూసీలో 10 ఏళ్ల క్రితం తెలంగాణ నుంచి కే. కేశవరావు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల హడావిడి, మంత్రులు నియామకం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. ఇక మల్లిఖార్జున్ ఖర్గే.. సీడబ్ల్యూసీ సభ్యుల నియామకంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ సారి సీడబ్ల్యూసీలో తెలంగాణకు రెండు బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు సీడబ్ల్యూసీలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్లీనరీలో.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు టికెట్లు, పార్టీ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. దీని ప్రకారం సీతక్కు సీడబ్ల్యూసీలో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివాసీ మహిళ అయిన సీతక్క.. గతంలో చత్తీస్‌గడ్ మహిళా కాంగ్రెస్ ఇంచార్జిగా కూడా పని చేశారు. అంతే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సీతక్కకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద సీతక్క గురించి మాట్లాడినట్లు తెలుస్తున్నది.

ఏఐసీసీ కార్యదర్శి ఏస్ఏ సంతప్ కుమార్‌ను కూడా సీడబ్ల్యూసీ సభ్యుడిగా పరిశీలిస్తున్నారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సంపత్‌ను తీసుకుంటే తెలంగాణలో కలిసి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. సీతక్క, సంపత్ కుమార్‌లకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా ఉత్సాహం పెరుగుతుందని, అలాగే ప్రజల్లోకి కూడా పాజిటీవ్ మెసేజ్ వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

ఎస్సీ కోటాలో దామోదర రాజనర్సింహా, మల్లు రవి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీడబ్ల్యూసీలో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీని కలిసిన వెంకట్ రెడ్డి సీడబ్ల్యూసీలో చోటు కల్పించాలని కోరినట్లు సమాచారం. టీపీసీసీ పదవి ఎలాగో ఇవ్వలేదు.. కనీసం సీడబ్ల్యూసీలో అయినా తనకు స్థానం కల్సించాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది.

కాగా, సీనియర్ల కోటాలో జానా రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం కోసం రేవంత్ రెడ్డి పైరవీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయనకు సీడబ్ల్యూసీ పదవి అయితేనే సరిపోతుందని కూడా అధిష్టానం వద్ద చెప్పినట్లు సమాచారం.

First Published:  26 Jun 2023 10:38 AM GMT
Next Story