Telugu Global
Telangana

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూస్తే.. ప్రతిపక్షాల గుండెలు ఝల్లుమంటున్నాయి : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రమే సాకారం కాకపోతే.. ఇలాంటి అభివృద్ధి జరిగేదా అని అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. ఒకప్పుడు సాగు నీరు, తాగునీరు, కరెంటు, రహదారుల పరిస్థితి ఎలా ఉండేది. ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూస్తే.. ప్రతిపక్షాల గుండెలు ఝల్లుమంటున్నాయి : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఇంత అభిృద్ధి జరగలేదు.. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి అయ్యిందో ఇక్కడున్న ప్రజలకే తెలుసు. గతంలో నిధుల కోసం నానా తంటాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడ అభివృద్ధికి నిధులు కావాలంటే అక్కడ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. ఆనాడు జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. ఈనాడు మానేరు దగ్గర సుజల దృశ్యంగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి.. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కరీంనగర్ జిల్లా పేరు చెబితేనే ఝల్లుమనాలే అని ఆనాడు ఉద్యమ సమయంలో పాడుకున్నాము. కానీ ఈ రోజు అభివృద్ధి చూస్తే ప్రతిపక్షాల గుండెలు నిజంగానే ఝల్లుమంటున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రమే సాకారం కాకపోతే.. ఇలాంటి అభివృద్ధి జరిగేదా అని అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. ఒకప్పుడు సాగు నీరు, తాగునీరు, కరెంటు, రహదారుల పరిస్థితి ఎలా ఉండేది. ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో మానేరు నది ప్రారంభమైన దగ్గర నుంచి గోదావరిలో కలిసే వరకు ఉన్న 180 కిలోమీటర్ల పొడవునా.. నిత్యం నీళ్లు ఉండే సుజల దృశ్యం ఆవిష్కృతం కానున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇవ్వాళ తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు ఎర్రటి ఎండాకాలంలో మత్తడి దుంకుతున్నాయి. మానేరు సహా.. వాగులు, నదులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని మంత్రి కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు, పాలమూరు ప్రాజెక్టు నుంచి కృష్ణా నది నీళ్లు ఒడిసి పట్టి తెలంగాణలోని బీడు భూములకు పారించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు నీళు ఇచ్చే నగరం కరీంనగర్ కావాలని మంత్రి కమలాకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాల విషయంలో ఇంతటి మహోన్నత లక్ష్యం పెట్టుకున్న నాయకుడు మరెవరూ లేరని కేటీఆర్ ప్రశంసించారు.

వినోద్ వంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేక పోయాము. ఈ రోజు కరీంనగర్‌లో ఎంపీగా ఎవరున్నారో మీకు తెలుసు. ఆయన ఇలాంటి మంచి పనులు ఏనాడైనా చేశారా? ఒక పాఠశాల, ఒక బ్రిడ్జి, ఒక టీటీడీ లాంటి గుడి ఎవరైనా కట్టారా అని ప్రశ్నించారు. ఒక వైపు గుడి బాగైతున్నది.. బడి బాగైతున్నది. పరిశ్రమలు బాగు అవుతున్నాయి.. వ్యవసాయం బాగు అవుతున్నాయి. ఏ రంగం చూసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నీ అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నాయి. ఇలాంటి అభివృద్ధి మరిన్ని ఏళ్లు కొనసాగాలంటే మరోసారి గంగుల కమలాకర్‌ను గెలిపించడమే కాకుండా.. ఎంపీగా వినోద్‌ను కూడా ఎన్నుకోవాలని కేటీఆర్ కోరారు.

మీ కళ్ల ముందు కనపడుతున్న అభివృద్ధిని చూడండి. పని చేసే నాయకుడు ఎవరో గుర్తించండి.. పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే పని చేయని నాయకులను తరిమి కొట్టి.. పని చేసే వారిని జబ్బ తట్టి ప్రోత్సహించారో.. రాబోయే ఎన్నికల్లో కూడా అలాంటి విజ్ఞత కరీంనగర్ ప్రజలు చూపించాలని కోరారు. అభివృద్దే మా కులం, సంక్షేమమే మా మతం, జన హితమే మా అభిమతమని ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  21 Jun 2023 5:59 PM GMT
Next Story