Telugu Global
Telangana

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై బీజేపీ ప్రేమ.. అసలు కారణం ఇదే..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కారణంగా మూడేళ్లలో రైల్వే శాఖకు 1500కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. అందులో అభివృద్ధి పనులకు చేసే ఖర్చు కేవలం 699కోట్లు. అది కూడా ఎన్నికల ఏడాదిలో హడావిడిగా మొదలు పెడుతున్న పనులు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై బీజేపీ ప్రేమ.. అసలు కారణం ఇదే..
X

సడన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై కేంద్రానికి ప్రేమ పుట్టుకొచ్చింది. హడావిడిగా ప్రధాని నరేంద్రమోదీ వచ్చి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 699 కోట్ల రూపాయల ఖర్చుతో మూడేళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. అసలు తెలంగాణపై సడన్ గా కేంద్రానికి ఇంత ప్రేమ ఎందుకా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దానికి సరైన సమాధానం ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. పోనీ ఎన్నికల వేళ అయినా కేంద్రం తెలంగాణకోసం నిధులు కేటాయిస్తుందిలే అనుకుంటే.. అది కూడా పొరపాటే అని గ్రహించాలి. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కారణంగా మూడేళ్లలో రైల్వే శాఖకు 1500కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. అందులో అభివృద్ధి పనులకు చేసే ఖర్చు కేవలం 699కోట్లు. అది కూడా ఎన్నికల ఏడాదిలో హడావిడిగా మొదలు పెడుతున్న పనులు. ఈ ఉదాహరణ చాలు కేంద్రానికి తెలంగాణపై ఉన్నది ప్రేమో, వివక్షో చెప్పడానికి.

దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలో సికింద్రాబాద్ ఒక్కటే నాన్ సబర్బన్ గ్రేడ్-1 (NSG-1) స్టేషన్. మిగతా ఏవీ ఆ స్థాయిని అందుకోలేదు. NSG స్టేషన్లంటే.. ప్రతి ఏడాది రూ.500 కోట్ల కనీస ఆదాయం ఉండాలి. లేదా ప్రతి ఏటా ఆ స్టేషన్ నుంచి 2కోట్ల మంది ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇలాంటి మార్గదర్శకాల ప్రకారం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒకే ఒక్క NSG స్టేషన్ గా సికింద్రాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. రోజుకు 200కు పైగా రైళ్లు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి స్టేషన్ అభివృద్ధికోసం గడచిన 9 ఏళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఖర్చు పెట్టిన సొమ్ము సున్నా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వేళ హడావిడిగా 699కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళిక అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.

మూడేళ్లలో 1500కోట్ల రూపాయల ఆదాయాన్ని సికింద్రాబాద్ నుంచి కేంద్రం తీసుకొంటోంది. అందులో కేవలం 47శాతం మాత్రమే తిరిగి ఆ రైల్వే స్టేషన్ పై ఖర్చు పెడుతోంది. ఈ ఖర్చుతో మరింత ఆదాయం సముపార్జించడమే కేంద్రం లక్ష్యం. అయితే తెలంగాణపై ఉన్న వివక్ష కారణంగా 9ఏళ్లపాటు ఈ ప్రతిపాదనలన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు కావాలి కాబట్టి ప్రధాని మోదీ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

First Published:  9 April 2023 10:57 AM GMT
Next Story