Telugu Global
Telangana

కేసీఆర్ పథకాలపై పొరుగు రాష్ట్రాల్లో సీక్రెట్ సర్వే..!

ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సీక్రెట్‌గా ఓ సర్వే చేయించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా సర్వేలు నిర్వహించనున్నారు.

కేసీఆర్ పథకాలపై పొరుగు రాష్ట్రాల్లో సీక్రెట్ సర్వే..!
X

జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ ప్రకటించేసి.. అభ్యర్థులను నిలబెడితే సరిపోదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే ముందుగా అసలు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం గురించి పొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సీక్రెట్‌గా ఓ సర్వే చేయించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా సర్వేలు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సర్వేలో ఎక్కువగా రైతులు, యువత, మహిళలతో పాటు ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా కలిశారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయాన్ని కూడా పొరుగు రాష్ట్ర ప్రజలు గుర్తు చేశారు. టీవీలు, పత్రికల ద్వారా ఆ విషయం తెలుసుకున్నామని అన్నారు. మరి కేసీఆర్ పీఎం అవడానికి అర్హత ఉన్నదా అని ప్రశ్నించగా.. గుజరాత్ సీఎంగా పని చేసిన మోడీ ప్రధాని అవగా లేనిది.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తప్పేముందని జవాబు ఇచ్చారు. జాతీయ పార్టీ పెడితే మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకే ఆ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఏపీలో పోటీ చేయాలనే ఆసక్తి లేకపోయినా.. పోలవరం ముంపు ప్రాంతాల్లో.. ముఖ్యంగా గతంలో తెలంగాణలో ఉండి.. ఇప్పుడు ఏపీలో కలిసిన ప్రాంతాల్లో సర్వే చేయించగా.. అక్కడ టీఆర్ఎస్‌కు ఆదరణ ఉంటుందని తేలింది.

మహారాష్ట్రలో తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే నాందేడ్, గడ్చిరోలి, సిరొంచ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. సిరొంచ, వాంఖిడి, బల్సారా ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను కొనియాడారు. ఆ పథకం తమ ప్రాంతాల్లో కూడా వస్తే చాలా మేలు చేకూరుతుందని సర్వేలో చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటకలో ఆసరా పెన్షన్ల పట్ల ఆకర్షితులయ్యారు. తమకు ప్రస్తుతం రూ.1200 మాత్రమే అందుతుందని.. తెలంగాణలో మాదిరిగా రూ.3016 వస్తే ఆర్థికంగా ఆసరా లభిస్తుందని చెప్పారు. రైతు బంధు, కల్యాణలక్ష్మి పథకాలు కూడా చాలా బాగున్నాయని అన్నారు. ఇక గడ్చిరోలి, రాయచూర్ ప్రాంతాల్లోకి కొన్ని గ్రామాలు.. తమను తెలంగాణలో కలిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఏపీలోని సర్పంచ్‌లు తమకు ఇక్కడ రూ.3 వేలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.6 వేలు చెల్లిస్తోంది. మాకు కూడా అలా ఇస్తే బాగుంటుందని తెలిపారు. మొత్తానికి మూడు రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో టీఆర్ఎస్ చేపట్టిన సర్వేలో సదాభిప్రాయాలే వెలువడ్డాయి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ పథకాలు తమకు కూడా అమలు అయితే బాగుంటుందనే అందరూ భావిస్తున్నారు. ఇది కచ్చితంగా కేసీఆర్ జాతీయ పార్టీకి సానుకూల సంకేతం అనుకోవచ్చు.

First Published:  28 Sep 2022 3:23 AM GMT
Next Story