Telugu Global
Telangana

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్..!

ఇటీవల పార్టీ రాజకీయ వ్యూహకర్త సునిల్ టీమ్ ఒక సర్వే చేసినట్లు తెలిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా తన అనుచరులను ఇతర పార్టీల్లోకి చేర్చారో అనేది నివేదికలో పేర్కొన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్..!
X

మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ, ఆ పేరుతో పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలే ఎక్కువగా చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కీలకమైన ఎన్నికల సమయంలో సీనియర్ నేతలు 'అంతర్గత ప్రజాస్వామ్యం' పేరుతో పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడులో ఉపఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఇద్దరు తెలంగాణ సీనియర్ నేతల తీరు ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావాలని అధిష్టానం భావిస్తుండగా.. ఉపఎన్నికలోనే గెలుస్తామనే ఆత్మవిశ్వాసం లేకుండా చేస్తుండటం కార్యకర్తలకు కూడా అసహనానికి గురి చేస్తోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిథర్ రెడ్డి వరుసగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఉప ఎన్నిక కోసం ఐక్యమత్యంగా పని చేయాల్సిన సమయంలో కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. మునుగోడు బైపోల్‌కు కారణమైన రాజగోపాల్ రెడ్డి సోదరుడే ఇలా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం సీనియర్లకు కూడా రుచించడం లేదు. ఇటీవల పార్టీ రాజకీయ వ్యూహకర్త సునిల్ టీమ్ ఒక సర్వే చేసినట్లు తెలిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా తన అనుచరులను ఇతర పార్టీల్లోకి చేర్చారో అనేది నివేదికలో పేర్కొన్నారు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని 10 మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలతో పాటు మండల స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. వీళ్లంతా కోమటిరెడ్డి అనుచరులే అని.. ఆయన అండదండలతోనే వీళ్లు వేరే పార్టీలోకి వలస వెళ్లారని ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బైపోల్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సహకరించే అవకాశం లేనట్లు నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే అధిష్టానానికి చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక విషయం తెలుసుకున్న తర్వాతే వెంకటరెడ్డి తనకు సోనియా అపాయింట్‌మెంట్ కావాలని కోరినట్లు సమాచారం.

భువనగరి ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి తన నియోజకవర్గం పరిధిలోనే ఉపఎన్నిక జరుగుతున్నా.. తమ్ముడికి వ్యతిరేకంగా పని చేయడం ఇష్టం లేకనే.. కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వెంకటరెడ్డిని పట్టించుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం సూచించింది. కానీ, ప్రతీ రోజు ఏదో ఒక విధంగా వెంకటరెడ్డి రెచ్చగొడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన సమయంలో తమ అసంతృప్తిని ప్రకటించి.. కేవలం మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని.. దీని వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని పార్టీ నాయకులు వాపోతున్నారు. గెలుపు కోసం పని చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకే అంతిమంగా నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

First Published:  19 Aug 2022 4:07 AM GMT
Next Story