Telugu Global
Telangana

బీజేపీ సీనియర్ల సీక్రెట్ మీటింగ్‌.. ఏం జరుగుతోంది..?

అమిత్ షా సైతం తమకు టైం ఇవ్వకపోవడం, కేవలం కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్‌లతోనే సమావేశం కావడంపై ఈ భేటీలో నేతలు చర్చించారు.

బీజేపీ సీనియర్ల సీక్రెట్ మీటింగ్‌.. ఏం జరుగుతోంది..?
X

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. తాజాగా పలువురు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చాడ సురేష్‌ రెడ్డి, గరికపాటి మోహన రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రవీంద్ర నాయక్‌, విజయ రామారావు హాజరయ్యారు. వీరి భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహార శైలిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్‌ పర్యటనలో కొంతమందినే కలిపించడంపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అమిత్ షా సైతం తమకు టైం ఇవ్వకపోవడం, కేవలం కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్‌లతోనే సమావేశం కావడంపై ఈ భేటీలో నేతలు చర్చించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ని కలవడం ఓకే అయినా.. ఈటలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లను ఈటల రాజేందర్ సంప్రదించకపోవడంపైనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నేతలు. ఇటీవల ములుగు నుంచి మాజీ మంత్రి చందులాల్‌ కొడుకు, సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 24న మరోసారి భేటీ కావాలని.. పార్లమెంట్ స్పెషల్ సెషన్‌ తర్వాత ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story