Telugu Global
Telangana

బీఆర్ఎస్ సెకండ్‌ లిస్ట్‌ రెడీ.. రెండ్రోజుల్లో ప్రకటన..!

ఒకటి, రెండు రోజుల్లో జనగామ, నర్సాపూర్, గోషామహాల్, నాంపల్లిలో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం.

బీఆర్ఎస్ సెకండ్‌ లిస్ట్‌ రెడీ.. రెండ్రోజుల్లో ప్రకటన..!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న బీఆర్ఎస్‌.. మిగిలిన నాలుగు స్థానాల విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో జనగామ, నర్సాపూర్, గోషామహాల్, నాంపల్లిలో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే జనగామలో పార్టీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. కొన్నిరోజుల క్రితం.. పల్లాకు మద్దతుగా పలువురు నేతలు హైదరాబాద్‌ ప్రగతిభవన్ సమీపంలోని హరిత ప్లాజాలో భేటీ కాగా.. మరుసటి రోజున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆయన మద్దతుదారులు సమావేశమయ్యారు. ఇప్పటికీ నియోజకవర్గంలో పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక జనగామ టికెట్‌పై ఆశలు పెట్టుకుని కొంతకాలంగా అక్కడ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకత్వం.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇక నర్సాపూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ నెలకొంది. అయితే వయస్సు రీత్యా మదన్‌ రెడ్డి స్థానంలో.. సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అయితే మదన్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ.. ఆయన మద్దతుదారులు ఇటీవల మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలను కలిశారు. మదన్‌రెడ్డికి నచ్చచెప్పి లేదా ఏదైనా ఇతర పదవి ఇచ్చి సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్ ఖాయం చేస్తారని పార్టీలో ప్రచారం జోరందుకుంది.

ఇక సిటీలోని గోషామహాల్‌ టికెట్‌ను పలువురు నేతలు ఆశిస్తున్నారు. దాదాపు ఆరుగురు నేతలు గోషామహాల్‌ రేసులో ఉన్నప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, నియోజకవర్గ బీఆర్ఎస్‌ ఇన్‌ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రేమ్‌సింగ్ రాథోడ్ 2018లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పోటీ చేసిన అభ్యర్థులకే మళ్లీ ప్రాధాన్యమివ్వడంతో.. మళ్లీ టికెట్ తనకే ఇస్తారని ప్రేమ్‌సింగ్‌ ధీమాతో ఉన్నారు. అయితే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ వయసును దృష్టిలో ఉంచుకొని నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక నాంపల్లిలో బీఆర్ఎస్‌ సీరియస్‌ పోటీ లేకపోయినప్పటికీ.. ఇప్పటివరకూ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదనే విషయంపై పార్టీ వర్గాల్లోనూ కొంత అయోమయం ఉంది. గోషామహాల్, నాంపల్లి టికెట్ విషయంలో.. పార్టీ పెద్దలు ఎంఐఎం అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నాంపల్లి టికెట్ మళ్లీ తనకే దక్కుతుందని గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్‌ గౌడ్ ధీమాతో ఉన్నారు. ఈ నెల 30న మిగిలిన 4 స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నాలుగు స్థానాలు ఫైనల్‌ చేసిన తర్వాత అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అసంతృప్తులతో వ్యవహరించాల్సిన తీరు.. ప్రచారం, విపక్షాలపై స్పందించాల్సిన తీరుతో పాటు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని ప్రకటించినా.. హరీష్‌ రావు, ఇతర నేతలపై ఆయన చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ విషయంలోనూ కేసీఆర్‌ పునరాలోచిస్తున్నారని ప్రచారం సాగుతుండగా.. మైనంపల్లి ఆయన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావును మార్చాల్సి వస్తే.. ఆ టికెట్ కోసం మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్​రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా BRS అధ్యక్షుడు శంభీపూర్‌రాజు పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

*

First Published:  27 Aug 2023 10:56 AM GMT
Next Story